రాజకీయంగా దెబ్బ తీసేందుకే నాపై కుట్ర : ఆఫ్కాఫ్ ఛైర్మైన్ అనీల్ బాబు

Clock Of Nellore ( Nellore ) – తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు తనకు గుంటూరు దళిత బాలిక అత్యాచారం కేసును అంటగడుతున్నారని, బాలిక తండ్రిని ప్రభావితం చేసి ఆయనతో తనపై ఫిర్యాదు చేయించారని ఆఫ్కాఫ్ ఛైర్మైన్ కొండూరు అనీల్ బాబు అన్నారు. గుంటూరుకు చెందిన ఎస్సీ మైనర్ బాలికను తన అతిధి గృహంలో ఉంచి అనేక మందిచే అత్యాచారం చేయంచారని అనీల్ బాబుపై బాధిత బాలిక తండ్రి ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనీల్ బాబుపై విచారణ జరపాలని ఎస్సీ కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసు మరో సారి తెరపైకి వచ్చింది. తన పేరు వచ్చిన నేపద్యంలో అనీల్ బాబు ఆదివారం నెల్లూరులో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన కిల్లేటి బాబురావు, చల్లారావు, శివయ్య అనే ముగ్గురు వ్యక్తులు తనపై కుట్రపన్ని బాలిక తండ్రిచే తనపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. తనను పదవిలో నుండి తీయించేలా అనేక కుట్రలు చేస్తున్నారని, ఆ కేసుకు నాకు సంభంధం ఏంటని ప్రశ్నించారు. తనకు ఎలాంటి గెస్ట్ హౌస్ లు లేవని, తాను పారిపోలేదని నెల్లూరులోనే ఉన్నానని పేర్కొన్నారు. ఆ కేసులో తాను ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని అనీల్ బాబు స్పష్టం చేశారు.

ఇంతకీ ఏం జరిగింది !
గుంటూరుకు చెందిన ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా నేత, ఏపీ ఫిషర్‌మెన్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ (ఆఫ్కాఫ్‌) ఛైర్మన్‌ కొండూరు అనిల్‌బాబు ఉన్నారని బాలిక తండ్రి రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను అనిల్‌ ఆయన అతిథిగృహాలు, ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించటంతో తన కుమార్తె భయపడి, విచారణ సమయంలో ఆయన పేరు చెప్పలేదని తాజాగా ఎస్సీ కమిషన్‌కు చెప్పారు. దీనిపై కమిషన్‌ విచారణకు ఆదేశించింది. గతంలో ఆ బాలిక కోర్టు, పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎంపీ ప్రధాన అనుయాయుడు కన్నా భూశంకర్‌ ఉండటంతో ఆయన్ను అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత అనిల్‌బాబు ఉన్నారని బాలిక తండ్రి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాలికపై అత్యాచారం కేసులో మరికొందరు ఉన్నారని బాలిక తండ్రి తనకు వినతిపత్రం అందజేశారని, దీనిపై విచారణ చేపట్టాలని గుంటూరు పోలీసులను ఆదేశించినట్లు ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ ధ్రువీకరించారు.

ఏడాది క్రితం బాధిత బాలిక, ఆమె తల్లి కరోనా సోకి గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. తల్లి మృతి చెందగా బాలిక కోలుకుంది.ఈ క్రమంలో ఓ మహిళ తాను ఇక్కడ నర్సుగా పనిచేస్తున్నానని బాలిక తండ్రిని పరిచయం చేసుకుంది. బాలికకు భవిష్యత్‌లో కరోనా రాకుండా నాటు వైద్యం చేయిస్తానని ఇంటికి తీసుకెళ్లింది. కొన్నిరోజుల తర్వాత బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపింది. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. తన కుమార్తె కనిపించటం లేదని ఆమె తండ్రి గతేడాది డిసెంబరులో మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు మూడు నెలల క్రితం ఆమె చెర నుంచి తప్పించుకుని గుంటూరు శివారు పేరేచర్లలో ఉంటున్న తండ్రి వద్దకు చేరుకుంది. జరిగిన విషయం తండ్రికి చెప్పటంతో మేడికొండూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాలికకు వైద్యం చేయిస్తానని తీసుకెళ్లిన మహిళ అరండల్‌పేట స్టేషన్‌ పరిధిలో ఉండటంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. గుంటూరుతో పాటూ విజయవాడ, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో విటుల వద్దకు పంపినట్లు ఆమెతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. మైనర్‌ బాలికపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఉమెన్‌ ట్రాఫికింగ్‌, పోక్సో తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక అత్యాచారం కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటి వరకు 66 మందిని అరెస్టు చేశామని గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ చెప్పారు. తాజాగా బాలిక తండ్రి ఎస్సీ కమిషన్‌కు చేసిన ఫిర్యాదు తనకు అందలేదని.. బహుశా పోస్టులో ఉందేమోనని అన్నారు.

Read Previous

రేపు నెల్లూరుకు సిఎం జగన్… మంత్రి పదవులపై క్లారిటీ వచ్చే అవకాశం

Read Next

రేపటి ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు – కలెక్టర్ వెల్లడి

Leave a Reply

Your email address will not be published.