Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటనకు పక్కాగా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ సోమవారం నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని వి.పి.ఆర్ ఫంక్షన్ హాల్ లో జరగనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి సోమవారం ఉదయం హెలికాప్టర్ లో బయలుదేరి 11-30 గంటలకు నగరంలోని పోలీసు కవాతు మైదానం లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారన్నారు. అనంతరం రోడ్డు మార్గాన కాన్వాయ్ బయలుదేరి విపీఆర్ ఫంక్షన్ హాల్ లో దివంగత మంత్రికి శ్రద్ధాంజలి ఘటిస్తారని తెలిపారు. హెలిప్యాడు, కాన్వాయ్ మార్గం, వేదిక వద్ద ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. హెలిప్యాడ్ వద్ద దుమ్ము పైకి లేవకుండా బాగా నీటితో తడపాలన్నారు. వేసవి కాలం అయినందున దాహార్తిని తీర్చేందుకు మంచినీటి ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలన్నారు. సీటింగ్, బారికేడింగ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లు సజావుగా ఉండేలా పర్యవేక్షించాలన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుండి వారు వెళ్లెంత వరకు ప్రజలు గానీ, ప్రజాప్రతినిధులు గానీ అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలని, ఎటువంటి పరిస్థితుల్లో సమావేశ మందిరంలో అటు ఇటు ఎలాంటి కదలికలు లేకుండా, నినాదాలు చేయకుండా మర్యాద పూర్వకంగా మెలిగేలా ముందస్తుగా అందరికి తెలియజేయాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రదేశాల్లోనూ ఎప్పటికప్పుడు చెత్త చెదారాలను తొలగించేలా కార్మికులను సిద్ధంగా ఉంచాలన్నారు. మూడు ప్రదేశాలలోనూ అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. మంచి స్థితిలో ఉన్న వాహనాలను ప్రజా ప్రతినిధుల కోసం కాన్వాయ్ లో ఉంచాలన్నారు. వేసవి కాలం అయినందున ఎవరికైనా వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నందున అవసరమైనన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బంది, మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. బ్రాడ్ బ్యాండు, అంతర్జాలము, పి. ఎ. సిస్టం, ఏసీలు, విద్యుత్ దీపాలు సజావుగా పనిచేసేలా చూడాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో అన్నిచోట్ల పారిశుద్ధ్యం సక్రమంగా ఉండేలా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహార సదుపాయం ఏర్పాట్లు చూడాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ హరెందిర ప్రసాద్, డి ఆర్ ఓ ఓబులేసు, జడ్పీ సీఈవో శ్రీనివాస రావు, ఆర్ డి వో లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.