నెల్లూరులో సైన్స్ పార్క్… పనులు పరిశీలించిన కమిషనర్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని మాగుంట లేఔట్ లో నూతనంగా నిర్మిస్తున్న సైన్స్ పార్క్ పనులు అత్యంత వేగవంతంగా చేపట్టామని, ఉగాది నాటికి పార్కులో ఫుట్ పాత్ ల నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. సైన్స్ పార్క్ నిర్మాణం అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వైజ్ఞానిక అంశాలతో అద్భుతంగా రూపొందనున్న సైన్స్ పార్క్ జిల్లాకే గర్వకారణంగా నిలవబోతోందని ఆకాంక్షించారు. విద్యార్థులకు సైన్స్ సబ్జెక్ట్ పట్ల ఆసక్తిని రేకెత్తించేలా, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను పెంచేలా సైన్స్ పార్క్ లో అంశాలను జోడిస్తున్నామని తెలిపారు. రానున్న మరో 4 నెలల్లో జరగాల్సిన నిర్మాణ పనులపై పటిష్టమైన ప్రణాళికలను రూపొందించి, అనుకున్న సమయానికి పూర్తి చేసేలా అధికారులు కృషి చేస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు. నిర్మాణం ప్రారంభించకమునుపు స్థలమంతా మురుగు చేరి, పిచ్చి చెట్లతో నిండి ఉండేదని, కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు మొదలయ్యాక స్థానికులంతా ప్రతిరోజూ నడక, సైక్లింగ్ తదితర వ్యాయామాలు ఈ స్థలంలో చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని కమిషనర్ వెల్లడించారు. ప్రజలందరికీ ఉపయోగపడే సైన్స్ పార్క్ నిర్మాణం పూర్తయేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ కోరారు.

Read Previous

ఆంధ్రా సరిహద్దు… తమిళనాడు బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

Read Next

రేపు నెల్లూరుకు సిఎం జగన్… మంత్రి పదవులపై క్లారిటీ వచ్చే అవకాశం

Leave a Reply

Your email address will not be published.