అమరజీవికి కలెక్టర్, ఎస్పీ ఘన నివాళులు…

Clock Of Nellore ( Nellore ) – ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా ఈ రోజు రాష్ట్రమంతా జరుపుకోవడం తెలుగు ప్రజలకు, జిల్లా వాసులకు ఎంతో గర్వకారణమని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అమరజీవి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం నేటి తరానికి ఆదర్శం కావాలన్నారు. దేశ చరిత్రలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు నేటికీ ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారని, వారిలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఒకరని అని అన్నారు. స్వాతంత్ర సమరంలో ఉప్ఫు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఎన్నో ఉద్యమాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు గాంధీజీ వెంట నడిచారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆయన ప్రాణత్యాగం పలితమేనన్నారు. తెలుగు జాతిని సంఘటిత పరుస్తూ ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు కారణం అయ్యారని కలెక్టర్ అన్నారు. స్వాతంత్ర సమరంలో తెలుగు వారి పాత్ర ఎనలేనిదని, వారి గుర్తుగా రాష్ట్రంలో జిల్లాలు ఏర్పాటు చేయడం వారికి నిజమైన నివాళులుగా చెప్పుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు.

దైనందిన జీవితంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితాన్ని వారి ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాకు మంచి పేరు తీసుకురావడంతో పాటు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను ముందంజలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, నెల్లూరు మునిసిపల్ కమీషనర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ రోజ్ మాండ్, తెలుగు గంగ ఇంచార్జి స్పెషల్ కలెక్టర్ దాసు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి చెన్నయ్య, మెప్మా పీడీ రవీంద్ర, డి.ఎస్.డబ్ల్యు.ఓ వెంకటయ్య, సెట్నల్ సి.ఈ. ఓ పుల్లయ్య, కె.వి చలమయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టర్ నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నున్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళి అర్పించారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విజయరావు, అదనపు ఎస్పీ వెంకట రత్నం పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి నివాళి అర్పించారు.

Read Previous

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు త్యాగం : మేయర్

Read Next

అమరజీవికి నివాళి అర్పించిన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం

Leave a Reply

Your email address will not be published.