Clock Of Nellore ( Amaravathi ) – రాష్ట్ర నూతన డీజీపిగా బాధ్యతలు చేపట్టిన పూర్వపు నెల్లూరు జిల్లా ఎస్పీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు నెల్లూరుజిల్లా, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆదివారం అమరావతిలోని వారి నివాసంలో ఆయన్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాల విభజన నేపద్యంలో కావలి నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యతను డీజీపికి వివరించారు. జిల్లాల విభజన జరుగుతున్న తరుణంలో నెల్లూరుజిల్లా రూరల్ ఎస్పీ కార్యాలయాన్ని కావలిలో ఏర్పాటు చేయాలని కోరారు. కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రాయలసీమ జిల్లాలకు రాకపోకలు సాగించడానికి కావలి పట్టణం ముఖ ద్వారం అయిందని డీజీపికి ఎమ్మెల్యే వివరించారు. పోలీసు శాఖ పరంగా కావలి పట్టణాన్ని ప్రముఖంగా తీర్చిదిద్దాలని, దానికి అనుగుణమైన స్థలాలు కావలిలో అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి… డీజీపిని కోరారు. దీనిపై స్పందించిన డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి… కావలిపై తనకు పూర్తి అవగాహన ఉందని అన్నీ అంశాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.