Clock Of Nellore ( Nellore ) – బ్యాంకింగ్ సేవల పట్ల వినియోగదారులకు అవగాహన కలిగించే పోస్టర్ ను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోవు రోజుల్లో మొత్తం బ్యాంకింగ్ సేవలు మొబైల్ ఫోన్ ద్వారా అందనున్న నేపథ్యంలో ప్రజలందరూ మొబైల్ కు వచ్చే మోసపూరిత సందేశాల పట్ల అప్రమత్తతో ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు రోజురోజుకు అధికమవుతున్నాయని, మొబైల్ ఫోన్లకు వచ్చే సందేశాలు తప్పు దారి పట్టించే విధంగా ఉంటున్నాయని, అందువల్ల ప్రజలందరూ వారి వారి లాగిన్ ఐడి, O T P (వన్ టైం పాస్ వర్డ్) డెబిట్ కార్డు వివరాలైన పిన్ నెంబర్, సి వి వి నెంబర్, ఇతర వ్యక్తిగత సమాచారం ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంకింగ్ వినియోగదారులందరూ సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులను పాటిస్తూ అన్ని వేళలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. మొబైల్ ఫోన్ లో అనవసరమైన యాప్లను డౌన్లోడ్ చేస్తే తమ గోప్యమైన వివరాలను రహస్యంగా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు హరేందిర ప్రసాద్, గణేష్ కుమార్, ఇంఛార్జి సంయుక్త కలెక్టర్ రోజ్ మాండ్, తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ నాగేశ్వర రావు, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డిఆర్డిఎ, డ్వామా పీడీలు సాంబశివ రెడ్డి, తిరుపతయ్య , డి పి ఓ ధనలక్ష్మి , వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
