Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి చెత్త సేకరణ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించన్నామని, అందులో భాగంగానే ప్రతి ఒక్క సచివాలయానికి ఒక్కో చెత్త సేకరణ వాహనాన్ని మంజూరు చేసి అధునాతన సాంకేతికత ద్వారా పర్యవేక్షిస్తున్నామని కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థకు నూతనంగా మంజూరు చేసిన 70 చెత్త సేకరణ వాహనాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలోని వాహనాలను శుక్రవారం ప్రారంభించారు. నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 70 చెత్త సేకరణ వాహనాలను మంజూరు చేసిందని, వాటితోటి ఇప్పటికే 13 డివిజన్లో తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించేలా ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టి సత్ఫలితాలు సాధించామన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 70 వాహనాల ద్వారా ఈ ఫలితాలు సాధించామని, క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంలో భాగంగా మరో 125 వాహనాలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో మరో 70 వాహనాలను పంపిణీ చేయగా వాటిని ఈరోజు ప్రారంభించామని తెలిపారు. మిగిలిన వాహనాలు కూడా త్వరలో కార్యాలయానికి చేరుకుంటాయని, అత్యంత త్వరలో నగరవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


