ఇక దేనికీ భయపడం.. వ్యవస్థను స్తంభింపజేస్తాం…

Clock Of Nellore ( Nellore ) – మూడేళ్లుగా ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల పేరుతో మరోమారు మోసపోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఒకటో తేదీకి పాత జీతాలు వేయకపోతే ఆ తరువాత పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. నెల్లూరులో ఉద్యోగ, ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఫిబ్రవరి 3న లక్షల మందితో చలో విజయవాడను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రుల కమిటీ చర్చలకు పిలిచినా ఉద్యోగ సంఘాల నేతలు రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తొమ్మిది మంది ప్రతినిధుల బృందం చర్చలకు వెళ్లామని, నలుగురు నేతలు నిర్ణయించుకుని లిఖితపూర్వకంగా తమ డిమాండ్లను ఇచ్చామని చెప్పారు. వాటికి సమాధానం చెబితే తాము చర్చలకు సిద్ధమేనన్నారు. 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల నమ్మకాన్ని ఈ ప్రభుత్వం పోగొట్టుకుందని తెలిపారు. అశుతోష్‌ మిశ్ర నివేదికను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి భారంగా ఉన్న రూ.10 వేల కోట్లు తమకొద్దని, పాత జీతాలివ్వండి చాలని పేర్కొన్నారు. రూ.1800 కోట్ల సప్లిమెంటరీ బిల్లులు, రూ.2100 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. మా జీతాల్లో కోతలు వేసి, ప్రభుత్వం ఆ డబ్బులు మిగుల్చుకుంటోందని విమర్శించారు. పీఆర్సీ సమస్య పరిష్కారమైతే ఉద్యోగుల్లో ఆవేదన, ఆవేశం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తే అదంతా భ్రమేనన్నారు. ఎందుకంటే ఈ ఉద్యమం పీఆర్సీతోపాటు సీపీఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొహిబిషన్‌ డిక్లరేషన్‌ వంటి ఇతర అంశాలపైనా చేస్తున్నామని చెప్పారు.

Read Previous

‘అతడో ఆర్మీ జవాన్.. పోర్న్ చూసే అలవాటు ఉంది.. కామ వాంఛ తీర్చుకునేందుకు..’

Read Next

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 40 మంది విద్యార్థులకు పాజిటివ్

Leave a Reply

Your email address will not be published.