నెల్లూరుజిల్లాలో సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ : శంఖుస్థాపన చేసిన మంత్రి లోకేష్

Clock Of Nellore ( Bogole ) – రాష్ట్రాన్ని రక్షణ తయారీ, సముద్ర సాంకేతిక రంగాల్లో దేశంలోనే ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గురువారం నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఏర్పాటు చేయనున్న సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ప్రపంచంలోనే గొప్ప పరిశ్రమను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. తన యువగళం పాదయాత్ర సమయంలో ప్రాంత మత్స్యకారులకు, వారి పిల్లలకు భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చాను అని, ఆ హామీని నిలబెట్టుకుంటూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నట్లు చెప్పారు.

దేశ రక్షణ రంగానికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరికరాల తయారీలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆటోనమస్ మారిటైమ్ సిస్టమ్స్, అన్‌మ్యాన్డ్ సర్ఫేస్ వెసల్స్, ఆధునిక సముద్ర సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి జరగనుందని తెలిపారు. ఈ కంపెనీతో తనకు ఒక బలమైన అనుబంధం ఉందని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, భారత స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, సముద్ర సాంకేతికతలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలకనుంది. తీర ప్రాంత భద్రత మరియు పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తూ, మత్స్యకార రంగం మరియు పారిశ్రామిక నైపుణ్యాల అభివృద్ధికి ఈ కేంద్రం ఒక గొప్ప ఊతంగా నిలవనుందని లోకేష్ అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు వెయ్యి మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర యువతకు అధునాతన సాంకేతిక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశం సువిశాలమైన సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉందని, అందులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని మంత్రి లోకేష్ చెప్పారు. సముద్ర తీర ప్రాంతాలను ఆధునిక పరిశ్రమల కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోందన్నారు. లక్షలాది కుటుంబాలు రాష్ట్రంలో సముద్ర తీరంపై ఆధారపడి జీవిస్తున్నాయని, అందుకనే గౌరవ ముఖ్యమంత్రి ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆక్వా రంగం, మత్స్యకార రంగాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దీని ద్వారా మత్స్యకారుల జీవన స్థితిగతులు మారనున్నట్లు చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుతో 25 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని, 1250 మేకనైజ్డ్ బోట్లు నిలుపుకునేలా, 41 వేల టన్నుల చేపల నిల్వ సామర్థ్యంతో ఈ ఫిషింగ్ హార్బర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు ఈ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదని మంత్రి నారా లోకేష్ మత్స్యకారుల్లో భరోసా నింపారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అభివృద్ధితో పాటు ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు కావడం ద్వారా తీర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట పడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో బ్లూ ఎకానమీ, సముద్ర పరిశ్రమలు మరియు ఆధునిక సాంకేతిక౫ రంగాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచంలో అద్భుతమైన ఇండస్ట్రీని జువ్వలదిన్నెలో ఏర్పాటుచేయడం మనందరి అదృష్టంగా భావించాలన్నారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నే వేదికగా ప్రపంచంలోనే మొట్టమొదటి సాగర్ డిఫెన్స్ అటానమస్ మారిటైమ్ షిప్‌బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్ కు శంకుస్థాపన జరగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఇక్కడి డ్రోన్లను ఉపయోగించి సముద్రంలోని ఏ ప్రాంతంలో ఎక్కువ మత్స్యసంపద ఉందో కూడా తెలుసుకోవచ్చన్నారు. ఈ పరిశ్రమ మత్స్యకారుల కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సుమారు వెయ్యిమందికి మరో రెండేళ్లలో ఈ ఇండస్ట్రీ ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఉపాధి కోసం వలసలు వెళ్లనక్కరలేదని, మన సొంత ఊర్లోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు, యువనేత నారా లోకేష్ కృషితో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.

ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ రక్షణరంగానికి సంబంధించిన పరిశ్రమను జువ్వలదిన్నెలో నెలకొల్పడం నెల్లూరుజిల్లాకు ఒక కానుక అన్నారు. ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా భారతరక్షణ రంగం, సాగర్ డిఫెన్స్ కంపెనీ కలిసి రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కషితో అతిపెద్ద పరిశ్రమను జువ్వలదిన్నె హర్బర్ కేంద్రంగా నెలకొల్పడం ఈ ప్రాంతవాసుల అదృష్టంగా చెప్పారు. అమరజీవి పొట్టిశ్రీరాములు మెమెరియల్ సెంటర్‌గా జువ్వలదిన్నెలో నారా లోకేష్ పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మత్స్యకార గ్రామాలకు బ్రిడ్జిలు, రహదారులు, తుఫాను బిల్డింగ్‌లన్నీ కూడా నారా లోకేష్ గారి హయంలోనే నిర్మించినట్లు గుర్తుచేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటు వలన మత్స్యకారులకు ఎంతో మేలు చేకూరుతుందని బీద రవిచంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.

కావలి శానససభ్యులు దగ్గుమాటి వెంకృష్ణారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మంగారి కాలజ్ఞానం మేరకు పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటుతో కావలి కనకపట్టణంగా మారుతుందన్నారు. నారా లోకేష్ గారి దూరదృష్టితో అనేక పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారుతుందన్నారు. అటు రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ ప్రాజెక్టు, ఇటు జువ్వలదిన్నె హర్బర్ కేంద్రంగా సాగర్ డిఫెన్సీ పరిశ్రమ, ఇంకా మరెన్నో నూతన పరిశ్రమలు కావలి సమీపంలో ఏర్పాటుకావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా చెప్పారు. ఇందుకు కృషిచేస్తున్న నారా లోకేష్‌కు కావలి ప్రజలు ఎప్పటికీ రుణపడి వుంటారన్నారు. మత్స్యకారులకు సేవ చేసే భాగ్యం తనకు లభించడం చాలా ఆనందంగా వుందన్నారు. జువ్వలదిన్నెలో ఫిషింగ్‌హార్బర్‌ను తాను నిర్మించానని, తన హయంలోనే అనేక పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కావడం మనసుకు సంతృప్తిగా ఉందన్నారు. ఈ పరిశ్రమ మత్స్యకారులకు భరోసాగా నిలుస్తుందని, దీనిని మనమంతా మనస్ఫూర్తిగా స్వాగతించి, సహకారం అందించాలన్నారు. ఇది ఒక పారిశ్రామికవాడగా అభివృద్ధి కానుందన్నారు. సాగర్ డిఫెన్స్‌లో కావలి పట్టణ యువతకు, సమీప గ్రామాల యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నారా లోకేష్‌ను కోరారు.

తొలుత నెల్లూరుజిల్లా బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప వద్ద మంత్రి నారా లోకేష్‌కు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ ను చూసేందుకు పెద్దఎత్తున విచ్చేసిన కార్యకర్తలు..అందరికి లోకేష్ అభివాదం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఎమ్మెల్యేలు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, సాగర్ డిఫెన్స్ కంపెనీ చైర్మన్ నికుంజ్, సీఈఓ ఆర్ కే బి సింగ్, సౌరబ్ పాటిల్, దయానంద్, సునీల్, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, సీఈవో అభిషేక్ కుమార్, పలువురు ప్రముఖులు, కంపెనీ ప్రతినిధులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు హైవే పక్కనే అదిరిపోయే సౌకర్యాలు : సిఎంకు వివరించిన కలెక్టర్ శుక్లా

Read Next

జిల్లాలో గ్యాస్ కొరత లేదు : గ్యాస్ కంపెనీ ప్రతినిధులతో జేసి సమీక్ష

Leave a Reply

Your email address will not be published.