సైబర్ మోసాలపై అసెంబ్లీలో గళమెత్తిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Amaravati ) – నేటి టెక్‌ యుగంలో సైబర్‌ క్రైం అనేది ఒక వ్యక్తి సమస్యలా కాకుండా సమాజ భద్రతకు పెను సవాల్ గా మారిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సైబర్‌ క్రైం అంశంపై గురువారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. డిజిటల్ లావాదేవీలు పెరిగిన కొద్దీ, డిజిటల్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రజల అమాయకత్వాన్నే ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్ట్‌టైమ్ జాబ్స్, ట్రేడింగ్, మ్యాట్రిమోని పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన చెందారు. OTP, KYC పేరుతో మోసాలు, సోషల్ మీడియా అకౌంట్ల హ్యాకింగ్, ఫేక్ జాబ్, లాటరీ, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, “డిజిటల్ అరెస్ట్” పేరుతో బెదిరింపులు.. బాధిత కుటుంబాలకు జీవితాంతం మరిచిపోలేని గాయాలుగా మారుతున్నాయన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బు నిమిషాల్లో మాయమవుతోందని చెప్పారు. ఉదాహరణకు కోవూరుకు చెందిన ఒక మహిళకు కేవైసీ పేరుతో వచ్చిన లింక్‌ క్లిక్‌ చేసి 2 లక్షలు పోగొట్టుకున్న విషయాన్ని ఆమె సభలో ప్రస్తావించారు.

సైబర్‌ క్రైం కంట్రోల్‌కు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. 24/7 కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ సెల్‌లను బలోపేతం చేయాలని, ఫిర్యాదు చేసిన వెంటనే ఫాస్ట్ ట్రాక్ యాక్షన్ సిస్టమ్ ఉండాలన్నారు. బ్యాంకులు, టెలికాం కంపెనీలతో స్ట్రాంగ్ కోఆర్డినేషన్, సైబర్ నేరాలపై కఠిన శిక్షలు ఉండాలన్నారు. అలాగే ప్రజలు కూడా ఎవరికీ OTP, PIN, బ్యాంక్ వివరాలు చెప్పకూడదని, అనుమానాస్పద లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దన్నారు. మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని, డిజిటల్ ఇండియా బలంగా ఉండాలంటే, సైబర్ భద్రత ఇంకా బలంగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్‌పై పోరాటం అంటే కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వ విధానం, వ్యవస్థ, ప్రజల అవగాహన మూడు కలిసి నడవాల్సిన అవసరాన్ని ఆమె వెల్లడించారు.

హోం మంత్రి అనిత స్పందన..
అనంతరం రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. కంటికి కనిపించని శత్రువులా సైబర్‌ క్రైం జరుగుతోందని, ఇందులో మోసపోతున్న అనేక మంది చదువుకున్న, ఉన్నత స్థితిలో ఉన్నవారేనని ఆమె పేర్కొన్నారు. గ్రామాలకు కూడా ఈ ధోరణి పెరుగుతోందన్నారు. 10 వ తరగతికే ఉద్యోగాలు అంటూ మయన్మార్‌, ధాయ్‌ల్యాండ్‌, ఇతర దేశాలకు పంపిస్తామంటూ మోసాలు చేస్తున్నారని అన్నారు. ఇటీవల ఏపీకి చెందిన 110 మందిని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో రక్షించామన్నారు. సైబర్‌ క్రైంపై అవగాహన చాలా అవసరమని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1596 అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 1930 అనే ఒక హెల్ప్‌ లైన్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రజల్లో డిజిటల్‌ అరెస్టుల పేరుతో ఒక భయం ఏర్పడుతోందని, అమ్మాయిలను కూడా ఎరగా వాడుతున్నారని అన్నారు. బిజినెస్‌ టిప్స్ అనే పేరుతో డబ్బులు దండుకుంటున్నారని అన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రతి జిల్లాలో సైబర్‌ సెల్‌ ఏర్పాటు చేశారన్నారు. 26 జిల్లాల్లో సైబర్‌ పోలీస్‌ స్టేషన్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు అయిందని, ఇప్పటికే రెండు సమావేశాలు పూర్తయ్యాయని, తప్పకుండా సైబర్‌ నేరాలను కట్టడి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే పోలీసు సిబ్బందిలో కూడా సైబర్‌ మోసాలపై ప్రత్యేక ట్రైనింగ్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. పక్కా ప్రణాళికతో దీనిపై ముందుకు సాగుతున్నామని చెప్పారు.

Read Previous

ఎముక ముక్కతో వృద్దురాలికి ప్రాణాపాయం : కాపాడిన మెడికవర్ వైద్యులు

Read Next

దుకాణాల తొలగింపుతో రోడ్డున పడ్డ చిరు వ్యాపారుల బ్రతుకులు

Leave a Reply

Your email address will not be published.