నకిలీ IRS అధికారిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – IRS అధికారినంటూ రాష్ట్రంలో పలు చోట్ల తిరుగుతూ అనేక మందిని మోసం చేయడమే కాకుండా నగదు వసూళ్లకు పాల్పడుతున్న రాంపూర్ రమేష్ అనే వ్యక్తిని నెల్లూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి కారు, నకిలీ IRS ఆఫీసర్ నేమ్ ప్లేట్, గవర్నమెంట్ అఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ రీజినల్ కమిషనర్ నేషనల్ ఎంబ్లెమ్ కలిగిన బోర్డు, రీజనల్ కమిషనర్ నెల్లూరు అనే స్టాంపును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్ లో నగర డిఎస్పీ సింధుప్రియ విలేకరుల సమావేశం నిర్వహించి నకిలీ IRS అధికారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయ్ చూర్ బసవన్న ఏరియాకు చెందిన 23 ఏళ్ల రాంపూర్ రమేష్ అనే వ్యక్తి ఐఆర్ఎస్ అధికారినంటూ ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్నాడని డిఎస్పీ చెప్పారు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో నిందితుడు నెల్లూరు రంగనాథస్వామి దేవస్థానానికి విచ్చేశాడు. ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డితో తాను IRS ఆఫీసర్ ని అని రీజనల్ జాయింట్ కమిషనర్ గా బదిలీ పై నెల్లూరుకు వచ్చినట్లు పరిచయం చేసుకున్నాడు. బాధ్యతల స్వీకరణకు ముందు స్వామి దర్శనం చేసుకునేందుకు వచ్చానని చెప్పగా ఈఓ శ్రీనివాసులు రెడ్డి ఆయనకు స్వామి దర్శనం చేయించారు.

దర్శనం అనంతరం తాను ఆలయాల ఆదాయపు పన్ను గురించి, భూ వివాదాలపై పనిచేస్తానని చెప్పి ఆలయ భూ వివాదాలకు సంభందించిన రిపోర్టు కాపీని తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం ఆలయ ఈఓకు ఫోన్ చేసి తనను వ్యక్తిగతంగా కలవాలని కోరగా ఈఓ నిరాకరించారు. నిందితునిపై ఈఓ శ్రీనివాసులు రెడ్డికి అనుమానం విచారించగా అతను నకిలీ IRS అధికారి అని నిర్ధారణ కావడంతో అదే రోజు రాత్రి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సంతపేట ఇన్ స్పెక్టర్ దశరధరామ రావు అతను బస చేసిన హోటల్ కు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా నకిలీ IRS అధికారి అని తేలింది. దీంతో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు డిఎస్పీ సింధుప్రియ తెలియజేశారు. అతని వద్ద నుండి 1. రమేష్ రాంపూర్ IRS ఆఫీసర్ నేమ్ ప్లేట్, 2. గవర్నమెంట్ అఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ రీజినల్ కమిషనర్ నేషనల్ ఎంబ్లెమ్ కలిగిన బోర్డు, 3. రీజనల్ కమిషనర్ నెల్లూరు అను స్టాంపు, 4. KA 36 Z 2681 అను కారు, 5. రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నెల్లూరులోని సెంట్రల్ జైలుకు తరలించారు.

Read Previous

కందుకూరులో మంత్రి ఆనం సుడిగాలి పర్యటన : అభివృద్ధి పనులకు శ్రీకారం

Read Next

ప్రేగు ఆరోగ్యంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్లే : మెడికవర్ వైద్యులు

Leave a Reply

Your email address will not be published.