Clock Of Nellore ( Mypadu Beach ) – అంతర్జాతీయ యోగా దినోత్సవ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో యోగాంద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటగా నెల్లూరు స్వర్ణాల చెరువులో నిర్వహించగా, మంగళవారం ఉదయం మైపాడు బీచ్ లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మైపాడు పరిసర ప్రాంతాల వందలాది మంది ప్రజలు బీచ్ లోని ఒంపుసొంపుల ఇసుక తిన్నెలపై యోగ సాధన చేయడం చూపరులను ఆకట్టుకుంది. ఉదయం వేళ, సాగర కెరటాల మధ్యన, ఆహ్లాదకర వాతావరణంలో ఎమ్మెల్వే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు జిల్లా ఇంచార్జి కలెక్టర్ కార్తీక్, ఆర్ డి ఒ పావని, ఇతర అధికారులు, ప్రజలు చేసిన సామూహిక యోగా సాధనతో మారుమూల గ్రామాలకు సైతం యోగ చేరాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లయింది.
ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు యోగ గొప్ప సాధనమని అన్నారు. చిన్న వయసు నుండే యోగా సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అదేవిధంగా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారు చక్కగా ఆచరించగలిగిన అత్యుత్తమ సాధనం యోగా అని అన్నారు. ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో యోగాంధ్ర లో ఇప్పటివరకు జిల్లాలో ఎనిమిది లక్షల మంది నమోదు చేసుకోవడం సంతోషకరమని, వారిలో కనీసం 75 శాతం మంది తర్వాతి రోజుల్లో కూడా యోగాను కొనసాగిస్తే, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ముఖ్యమంత్రి కోరిక నెరవేరుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం గ్రామస్థాయికి చేరినప్పుడే సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యోగాంధ్ర స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ యోగా ను తమ జీవితాల్లో భాగం చేసుకోవాలన్నారు.
జిల్లా ఇంచార్జి కలెక్టర్ కె. కార్తీక్ మాట్లాడుతూ ఆరోగ్యంతో కూడిన అందమైన జీవన విధానానికి యోగా మంచి సాధనమన్నారు. సామూహిక వ్యాధుల నిరోధానికి యోగ పరిష్కారమన్నారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో జిల్లాలో ఇప్పటివరకు 8 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. 124 మంది మాస్టర్ ట్రైనీలను గుర్తించామని, అలాగే 7000 మంది సాధారణ శిక్షకులను గుర్తించామన్నారు. వీరి ఆధ్వర్యంలో గ్రామ,వార్డు స్థాయిల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఈ యోగ సాధన కార్యక్రమంలో పాల్గొని తమ ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకోవాలన్నారు. ఇప్పటికే యోగా పై గ్రామస్థాయిలో వివిధ పోటీలు నిర్వహించామని, మండల స్థాయిలో పోటీలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయన్నారు. యోగాను అందరికీ చేరువ చేయాలనే ప్రయత్నానికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన శాసనసభ్యులు ప్రశాంతి రెడ్డికి తమ ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఆర్ డి రమణ ప్రసాద్, జడ్పీ సీఈవో విద్యారమ, డిఆర్డిఏ, డ్వామా పిడిలు నాగరాజ కుమారి, గంగాభవాని, జిల్లా టూరిజం అధికారి ఉషశ్రీ, డిటిసి చందర్, డి ఎస్ డి ఒ యతిరాజ్, సెట్నాల్ సీఈవో నాగేశ్వరరావు, యోగా మాస్టర్ స్వప్న, స్థానిక నాయకులు కమలాకర్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
