అందుకే టెంకాలయ బ్యాచ్ కు టెంకె పగలగొట్టారు : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore Rural ) – గత ప్రభుత్వంలో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పక్కకు వచ్చాక తనపై కోపంతో రూరల్ నియోజకవర్గంలో అప్పటికే మంజూరైన అభివృద్ధి పనులన్నీ అప్పటి వైసీపి ఇంఛార్జులు రద్దు చేయించారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలు అడిగిన ప్రతీ దానికి నిధులు లేకున్నా నేతలు టెంకాయలు కొట్టి ప్రజలను మోసం చేశారన్నారు. ఆ టెంకాలయ బ్యాచ్ కొట్టిన ఏ టెంకాయ పని చేయలేదని ఎద్దేవా చేశారు. అందుకే ఎన్నికల్లో ఆ టెంకాలయ బ్యాచ్ కు ప్రజలు టెంకె పగలగొట్టారని కోటంరెడ్డి తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తాను వారు రద్దు చేసిన పనులన్నింటినీ తిరిగి మంజూరు చేయించి పూర్తి చేయిస్తున్నానని వెల్లడించారు. తాను టెంకాయ కొట్టి శంఖుస్థాపన చేశానంటే ఆ పని పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. గురువారం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సౌత్ మోపూరులో పర్యటించారు. సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి 1కోటీ 20 లక్షల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంఖు స్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత మూడు ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా సౌత్ మోపూరు గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించారని వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ఫ్యాక్షన్ గొడవలు పెట్టుకోవద్దంటూ గ్రామ యువతకు విజ్ఞప్తి చేశారు. రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవని, భవిష్యత్తులోనూ ఉండబోవని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే సౌత్ మోపూరులో దాదాపు 2 కోట్ల 55 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. గడప గడపకు పేరుతో ప్రతీ ఇంటికి వస్తున్న తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆశీర్వదించారని కోరారు. గిరిధర్ రెడ్డి తనకంటే ప్రజల ప్రేమను ఎక్కువగా పొందుతాడని అభినందించారు.

Read Previous

MP మాగుంటకు అస్వస్థత : అపోలో హాస్పిటల్ లో గుండె బైపాస్ సర్జరీ

Read Next

వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలించండి : అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

Leave a Reply

Your email address will not be published.