Clock Of Nellore ( Nellore ) – వచ్చే నెల 4వ తేదీనా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపద్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా, ముందు జాగ్రత్త చర్యగా నెల్లూరుజిల్లాలో పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఆదేశాలతో గత వారం నుండి పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిర్భంధ తనిఖీలు చేపడుతున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఎలాంటి పత్రాలు లేని వివిధ వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా మంగళవారం నెల్లూరు నగరంలోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్భంధ తనిఖీలు చేపట్టారు. అలాగే ఉదయగిరి, జలదంకి పోలీసు స్టేషన్ పరిధిలో కూడా డిఎస్పీలు, సిఐలు, ఎస్సైల సాయంతో స్పెషన్ పార్టీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో బయట వ్యక్తులెవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 31 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘీక శక్తుల ఏరివేతే లక్ష్యంగా నిర్భంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
