Clock Of Nellore ( Kovur ) – విభజన చట్టాలు అమలు కాక అధోగతి పాలైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురాగల సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రత్యేక హోదాతో వేలాది మంది యువతకు ఉద్యోగాలు రావడంతో పాటూ అనేక పరిశ్రమలు వస్తాయని తెలిపారు. భవిష్యత్తును నిర్ణయించే ఓటును ఆలోచించి వేయాలని ప్రజలకు ఆమె విజ్జప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆమె నెల్లూరుజిల్లా కోవూరు నియోజకవర్గ కేంద్రానికి విచ్చేశారు. నెల్లూరు ఎంపి కాంగ్రెస్ అభ్యర్ధి కొప్పుల రాజు, కోవూరు కాంగ్రెస్ అభ్యర్ధి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కోవూరు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రచార సభలో షర్మిల మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతుందని, ఈ పదేళ్లలో చంద్రబాబు, జగన్ సిఎంలుగా పనిచేశారని, వారు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. నకిలీ మద్యం వ్యాపారం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ పేదల ప్రాణాలు తీస్తున్నారని, ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపిలో విక్రయిస్తున్నారని ప్రభుత్వంపై షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో బిజేపి… బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని ఈ ముగ్గురిలో ఎవ్వరికీ ఓటు వేసినా బిజేపికి వేసినట్లేనని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రం అన్నీ విధాలా అభివృద్ధి చెందాలంటే ప్రతీ ఒక్కరూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. నెల్లూరుజిల్లాకు కలెక్టర్ సేవలందించి జిల్లా ప్రజల మన్ననలు అందుకున్న కొప్పుల రాజును ఎంపిగా, కోవూరు ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలకు షర్మిల పిలుపునిచ్చారు. అంతకు ముందు కడప నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కోవూరుకు వచ్చిన షర్మిలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి, ఎంపి అభ్యర్ధి కొప్పుల రాజు, కోవూరు అభ్యర్ధి కిరణ్ కుమార్ పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.

