Clock Of Nellore ( Nellore ) – గత కొద్ది రోజులుగా… వాలంటీర్లు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ వలసల జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా….నెల్లూరు సిటీలో నియోజకవర్గంలోని పలువురు వాలంటీర్లు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నెల్లూరు గోమతినగర్‌లోని మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో… నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సమక్షంలో వాలంటీర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం పార్టీలో చేరిన వాలంటీర్లందరికీ నారాయణ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారికి గౌరవ వేతనం పెంచడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా టీడీపీ ప్రభుత్వంలో పదివేల రూపాయల గౌరవ వేతనం అందచేస్తామని మాటిచ్చారు. రానున్న ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని భావించిన వాలంటీర్లు టీడీపీలో చేరుతుండడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆయన నెల్లూరు ట్రంకురోడ్డు, కాపువీధి తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతీ షాపు వద్దకు వెళ్లి వ్యాపారస్తులతో పాటూ కొనుగోలు దారులను ఆప్యాయంగా పలకరించారు. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తనను, ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్ధించారు.
