నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం : 437.01 కోట్లకు ఆమోదం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ రూపొందించామని నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సర్వసభ్య బడ్జెట్ సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. మేయర్ స్రవంతి అధ్యక్షతన 2023 – 24 ఆర్ధిక సంవత్సరం యొక్క సవరించిన బడ్జెట్ అంచనాలు రూ. 99.21 కోట్ల రూపాయల ప్రారంభ నిల్వతో మొదలై స్వంత నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటులతో కలిపి రూ. 232.67 కోట్ల రూపాయలు జమలుగా, రూ. 219.02 కోట్ల రూపాయలు ఖర్చులుగా సవరించటం జరిగింది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో రూ. 112.86 కోట్ల రూపాయలు ప్రారంభ నిల్వగా, రూ. 332.01 కోట్ల రూపాయల జమలకు గానూ మొత్తం రూ.437.01 కోట్ల రూపాయలు ఖర్చుగా ప్రతిపాదించి ఆమోదం పొందటమైనది. నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ ను కేటాయించడం జరిగిందని మేయర్ తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నగర పాలక సంస్థ బడ్జెట్ కేటాయింపులు చేపట్టామని, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపేందుకు ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ ను రూపొందించి ఆమోదించామని మేయర్ ప్రకటించారు. విభాగాల వారీగా రూపొందించిన బడ్జెట్లో నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనులకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ కేటాయింపులు జరిపామని, అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని మేయర్ వెల్లడించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, వివిధ డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ వికాస్ మర్మత్, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Previous

టిడిపి ప్రభుత్వం రాగానే పేదలకు 43వేల ఇళ్లు : ప్రచారంలో నారాయణ వెల్లడి

Read Next

నెల్లూరులో పశువుల మాఫియా : తరలింపును అడ్డుకున్న యజమానులు

Leave a Reply

Your email address will not be published.