Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర వ్యాప్తంగా ప్రధాన రోడ్లమీద వాహనదారులకు అడ్డంకిగా మారిన పశువులను వాటి యజమానులు తీసుకెళ్లకపోతే కఠిన చర్యలు తప్పవని నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. పశువులను గోశాలకు తరలించే స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి కల్లూరుపల్లి గోశాలకు తరలిస్తున్న పశువుల వాహనాన్ని యజమానులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ యజమానులతో మాట్లాడుతూ వాహన ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్లపై సంచరించే పశువులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మేయర్, కమిషనర్ ల ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం సహకారంతో గోశాలకు తరలించి వాటి సంరక్షణ బాధ్యతలను నగరపాలక సంస్థ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుందని యజమానులకు తెలిపారు. పశువులను యజమానులు వాళ్ల ప్రాంగణాలలోనే ఉంచుకోవాలని, రోడ్లపై వదిలితే తప్పనిసరిగా వాటిని గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంతు వైద్యాధికారి డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
