మనస్ఫూర్తిగానే నరసారావుపేట వెళ్తున్న : నెల్లూరుకు వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) – మనస్ఫూర్తిగానే నరసారావుపేటకు వెళ్తున్నానని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. 15 ఏళ్లుగా తనను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన నెల్లూరు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, వారికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. నరసారావుపేట పార్లమెంటు వైసీపి అభ్యర్ధిగా పోటీ చేయనున్న నేపద్యంలో మంగళవారం అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించి నెల్లూరుకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలియజేశారు. ఈ 15 ఏళ్లలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తన వల్ల ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను నరసారావుపేట వెళ్తున్న క్రమంలో కొంత మంది పార్టీని వీడవచ్చని, అయినా ఫర్వాలేదని, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం వస్తుందన్నారు. స్వార్ధపరులే వైసీపిని వీడతారని, జగన్ ను అభిమానించే ఏ ఒక్కరూ పార్టీని వీడి వెళ్లరని అన్నారు. నెల్లూరు సిటీ నుండి వైసిపి అభ్యర్ధిగా పోటీ చేయనున్న ఖలీల్ ను మారుస్తారనే ప్రచారం జరుగుతుందన్న దానికి అనీల్ స్పందిస్తూ… ఇప్పటి వరకైతే ఖలీలే అభ్యర్ధి అని, రేపు ఏం జరుగుతుందో తనకు తెలియదని వెల్లడించారు. నరసారాపుపేటలో కూడా గెలుస్తాననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నుండి నరసారావుపేటలో ప్రచారం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపి మరో సారి జయకేతనం ఎగురవేస్తుందని, మళ్లీ జగన్ సిఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి జగన్ పై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అనీల్ వెల్లడించారు.

Read Previous

కిన్నెర బాటలో పలువురు కార్పొరేటర్లు : నారాయణతో రహస్య మంతనాలు

Read Next

నెల్లూరు అపోలో హాస్పిటల్ కు బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవార్డు

Leave a Reply

Your email address will not be published.