సర్వేపల్లిలో కోట్ల భూ కుంభకోణం : మంత్రి కాకాణిపై సోమిరెడ్డి విమర్శలు

Clock Of Nellore ( Nellore ) – సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులు భారీ భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అధికారులు చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో సోమిరెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గడచిన నాలుగేళ్లలో నెల్లూరుజిల్లాలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయని, వైసీపి ఎమ్మెల్యేలు, నేతలు రాబంధుల్లా వాలి భూములను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన అసైన్డ్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులు నిరుపేదల భూములను కాజేస్తున్నారన్నారు. రామదాసు కండ్రిగలో కోటి రూపాయల విలువజేసే 57 ఎకరాల భూమిని నిరుపేదలైన వాటి యజమానులను బెదిరించి కేవలం 15లక్షలకే మంత్రి కాకాణి కొనుగోలు చేశారని ఆరోపించారు. అసైన్డ్ భూములైన ఆ భూమి రికార్డులను మంత్రికి అనుకూలంగా రెవెన్యూ అధికారులు మార్చేస్తున్నారని చెప్పారు. మంత్రి చెప్పిన ప్రతీ అడ్డమైన పనిచేసే అధికారులు భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడుతారని హెచ్చరించారు. జగన్ మాట విన్నఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి సైతం జైలుకు వెళ్లిందని సోమిరెడ్డి గుర్తు చేశారు. నిజాయితీ గత అధికారులు సర్వేపల్లిలో పనిచేయలేకపోతున్నారని పేర్కొన్నారు. మంత్రి కాకాణి మాటలు విని కొందరు అధికారులు కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయడం లేదని చెప్పిన సోమిరెడ్డి… కొందరు అధికారులకు కోర్టు జరిమానా విధించిన విషయాన్ని గుర్తు చేశారు. అనేక మంది అధికారుల పదోన్నతులు నిలిచిపోయాయని వెల్లడించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసే భూ కుంభకోణాలకు అధికారులు సహకరించవద్దని లేదు ఆయన చెప్పినట్లే చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని సోమిరెడ్డి హెచ్చరించారు. వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

Read Previous

నెల్లూరు రూరల్ లో సంఘీభావ సదస్సులు : ప్రజల్లోకి వెళ్లనున్న కోటంరెడ్డి

Read Next

మధుమేహంతో కంటి సమస్యలు : జాగ్రత్తలు తెలియజేసిన మెడికవర్ వైద్యులు

Leave a Reply

Your email address will not be published.