నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీకి న్యాక్ ‘A’ గ్రేడ్ గుర్తింపు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీకి నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (NAAC) నుండి 3.23 CGPA తో ‘A’ గ్రేడ్ సమకూరింది. ఈ మేరకు వర్శిటీ వైస్ – ఛాన్సలర్ ఆచార్య జి.ఎం.సుందరవల్లికి న్యాక్ కార్యాలయం నుండి అధికారిక సమాచారం అందింది. ఈ సందర్భంగా వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ఎం.సుందరవల్లి మాట్లాడుతూ వర్శిటీకి మొదటి ప్రయత్నంలోనే ఇంత మంచి గ్రేడ్ వచ్చేలా సహకరించిన సిబ్బంది, విద్యార్థులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను వీసీగా బాధ్యతలు చేపట్టాక వర్శిటీలో భవన నిర్మాణాలు, మౌళిక సదుపాయాల ఏర్పాటు నిమిత్తం అనుమతులిచ్చిన సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వర్శిటీ అభివృద్ధికి అనునిత్యం తమ సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి, నిధుల సమీకరణలో భాగంగా తమ ఎంపీ ల్యాడ్స్ నిధులను కేటాయించిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తికి ధన్యవాదాలు తెలిపారు. వర్శిటీకి న్యాక్ లో మంచి గ్రేడ్ రావడమే లక్ష్యంగా అవిరాల కృషి చేసిన వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి.రామచంద్రారెడ్డి, వర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.విజయానంద్ బాబు, వర్శిటీ ఐక్యూఏసీ డైరెక్టర్ ఆచార్య అందె ప్రసాద్, వర్శిటీ న్యాక్ డైరెక్టర్ ఆచార్య సుజా ఎస్ నాయర్ ప్రత్యేకంగా అభినందించారు. విశ్వవిద్యాలయానికి న్యాక్‌ లో మంచి గ్రేడ్‌ సమకూరిన కారణంగా ఎన్నో లాభాలు చేకూరనున్నాయన్నారు. విశ్వవిద్యాలయానికి వివిధ కేంద్ర, రాష్ట్ర సంస్థల నుండి పరిశోధన, బోధన అభివృద్ధి నిధుల కేటాయింపు పెరుగుతుందన్నారు. జాతీయ నూతన విద్యావిధానం అమల్లోకి వచ్చిన తరుణంలో న్యాక్‌ గ్రేడ్‌ వల్ల స్వయం ప్రతిపాదిక కోర్సుల నిర్మాణానికి ఉపయోగకరంగా మారుతుందన్నారు. దూరవిద్య కేంద్రం కోర్సుల నిర్మాణం స్వతహాగా చేసుకొనేందుకు అవకాశం లభించే వీలు ఉందన్నారు. విశ్వవిద్యాలయంలో స్వయం ప్రతిపాదిక కోర్సుల నిర్మాణానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వర్శిటీకి ప్రస్తుతం సమకూరిన న్యాక్ ‘A’ గ్రేడ్ ఐదేళ్ళు పాటు అమల్లో ఉంటుందని, తదుపరి సైకిల్ లో మరింత ఉన్నత గ్రేడ్ సాధించే దిశగా వర్శిటీని ప్రగతి మార్గంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Read Previous

పొరపాటును సరిదిద్ధుకున్నానన్న మేయర్ స్రవంతి : మంత్రి కాకాణితో భేటీ

Read Next

మూడో రోజూ కొనసాగిన నిరాహార దీక్షలు : కోటంరెడ్డి ఆధ్వర్యంలో నిరసన జ్యోతి

Leave a Reply

Your email address will not be published.