Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రజా జీవనానికి అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు వహించాలని, వర్షపు నీరు అండర్ బ్రిడ్జిలలో నిలవకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మట్ ఆదేశించారు. వర్షాలకు నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రధాన డ్రైను మార్గాలు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలు, మాగుంట లే అవుట్, విజయ మహల్ గేట్, రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ లు, పంపింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపధ్యంలో కార్పొరేషన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసారు. రహదారులు, రోడ్లు, అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మోటార్ల ద్వారా తోడివేయాలని తెలిపారు. ముఖ్యంగా పాదచారులు, వాహన చోదకులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రధాన ప్రాంతాలలో అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ప్రజలు భారీ వృక్షాల సమీపంలో నిలవడం, విద్యుత్ స్థంబాలను తాకడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంపత్ కుమార్, చంద్రయ్య, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
