రైతులు ప్యాంట్లు వేసుకోకూడదా ? – కలెక్టర్ పై సోమిరెడ్డి ఆగ్రహం

Clock Of Nellore ( Nellore ) – చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన రైతులపై నెల్లూరుజిల్లా కలెక్టర్ హరి నారాయణన్ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా అవమానించారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సోమవారం రైతులు కలెక్టర్ ను కలవగా మీరు రైతులేంటి ?, ఫ్యాంట్లు వేసుకున్నారే ?, రాజకీయాలు చేసేందుకు వచ్చారా ?, వెళ్లండి అని కలెక్టర్ అవమానించారని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఇవాళ చంద్రమోహన్ రెడ్డి, గత వారం కలెక్టర్ ను కలిసిన రైతులు పంచెలు ధరించి నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో కలెక్టర్ హరి నారాయణన్ అక్కడ లేరు. జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ఉండగా సోమిరెడ్డి ఆయన్ను కలిసి చెరువులో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసి కలెక్టర్ తీరును తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. రైతులు ప్యాంట్లు వేసుకోకూడదా అని ప్రశ్నించారు. ఆ రైతులు కష్టపడి పంట పండిస్తేనే కలెక్టర్ గదిలో కూర్చుని మూడు పూటలా తింటున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ కలెక్టర్ కూడా ఈ విధంగా ప్రవర్తించలేదని మండిపడ్డారు. కలెక్టర్ తీరు హేయమైనదిగా అభివర్ణించారు. తక్షణం అధికారులు చెరువుల్లో అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని జేసీని కోరారు. అలాగే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మట్టి అమ్ముకునే స్థాయికి మంత్రి కాకాణి దిగజారిపోయారని విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో మంత్రి, ఆయన అనుచరులు అక్రమంగా మట్టిని తవ్వి లే అవుట్లకు విక్రయించుకుంటున్నారని, గ్రావెల్ ను కూడా వదల్లేదని మండిపడ్డారు. గ్రావెల్ గుంతలకు చిన్నారులు బలి అవుతున్నారని ఇకనైనా అధికారులు స్పందించాలని కోరారు.

 

Read Previous

లోకేష్ ఆరోపణలు నిజం కాదు : దేవుని ఎదుట ప్రమాణం చేసిన అనీల్

Read Next

ఆనంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published.