Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు ఎంపీగా నాలుగేళ్లలో జిల్లాకు ఎన్నో నిధులు తీసుకొచ్చానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు 28వ డివిజన్ శాంతినగర్ ఒకటో వీధిలో సిమెంట్ రోడ్డుకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ డివిజన్ ఇంచార్జ్ మదన్మోహన్ రెడ్డి ఎంపీగా నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదాలచే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ నాలుగేళ్లలో రాష్ట్రానికి సంబంధించినవే కాకుండా ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు అనేక కార్యక్రమాలు తెచ్చానని తెలిపారు. మినీ బైపాస్ లో ఫ్లైఓవర్, బైపాస్ లో మూడు ఫ్లైఓవర్లు మంజూరు చేయించానన్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్ కు 100 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సాధారణంగా వచ్చే నిధులు కాకుండా అనేక శాఖల నుంచి అదనంగా నిధులు మంజూరు చేయించానని తెలిపారు.
ఎంపీగా ఉన్న తనను సీఎం జగన్ మోహన్ రెడ్డి రూరల్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలను అడిగిందే తడువుగా సీఎం మంజూరు చేశారని చెప్పారు. ఈ నాలుగేళ్లలో ఒక సంక్షేమ కార్యక్రమం తప్పిపోకుండా అమలు పరిచారని ప్రశంసించారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పేదలకు నేరుగా మేలు చేశారని కొనియాడారు. రూరల్ నియోజకవర్గంలో లేఅవుట్ల ద్వారా కొత్త ప్రదేశాలు కలిశాయని, వాటిలో సౌకర్యాలు లేవని అన్నారు. అందువల్ల ఎక్కడెక్కడ రోడ్లు తదితర సౌకర్యాలు అవసరమో వాటిని పూర్తి చేస్తామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో రౌడీయిజం లేకుండా చేస్తానని ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. స్థానికులు ఎవరు రౌడీయిజాన్ని సహించరని అభిప్రాయపడ్డారు. రూరల్ లో ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా తన దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డివిజన్ ఇంచార్జ్ మదన్ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు అవినాష్, సత్తార్ వైసీపీ నేతలు స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, రియాజ్, రాజేష్, హరిబాబు యాదవ్, నరసింహులు గౌడ్,సూరి బాబు తదితరులు పాల్గొన్నారు.
