Clock Of Nellore ( Nellore ) – తనపై కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులోని సర్వేపల్లి కాలువను ఆధునీకరిస్తుంటే దానిపై కూడా బురద జల్లుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన 6వ డివిజన్ లో పర్యటించారు. సాలివీధిలో 20 లక్షలతో నిర్మించే డ్రైనేజీ కాలువ నిర్మాణానికి శంఖు స్థాపన చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే అనీల్ మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి కాలువ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తాను సర్వేపల్లి ఆధునీకరణ పనులు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఇటీవల ఇదే కాలువ నుండి సర్వేపల్లి రైతులకు సాగునీరు విడుదల చేస్తున్నారని ఆ సందర్భంలో పనులు నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. కేవలం 2 రోజుల వ్యవధిలోని రెండో పంటకు కూడా నీటిని విడుదల చేశారన్నారు. కాలువలో సాగునీరు ప్రవహిస్తుంటే పనులెలా చేస్తారని ప్రశ్నించారు. రైతులను నీటి విడుదల పూర్తయిన తర్వాత యధావిధిగా పనులు సాగుతాయని వివరణ ఇచ్చారు. ఇవేమి చూడకుండా పనులు నిలిచిపోయాయని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తానేం చేశానో నగర ప్రజలకు తెలుసునని అనీల్ పేర్కొన్నారు.
