నా మాటలను వక్రీకరించారు… సిఎం ఫోటో పెట్టడం తనకూ ఇష్టమే : స్పష్టం చేసిన మేయర్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టిన ఘటనలో తన మాటలను కావాలనే ఓ వర్గం కార్పొరేటర్లు వక్రీకరించి గిరిజన కులానికి చెందిన తనను అవమానించారని నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశం వాయిదా తర్వాత తాను ఛాంబర్ కు వెళుతుంటే కార్పొరేటర్లు మొయిళ్ల గౌరి, మూలే విజయభాస్కర్ రెడ్డి, బొబ్బల శ్రీనివాస యాదవ్ లు తనపై దాడి చేయడమే కాకుండా తన దుస్తులను లాగేంత పని చేశారని ఆమె పేర్కొన్నారు. సోమవారం కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశం వాయిదా తర్వాత మేయర్ తన ఛాంబర్ లో విలేకరులతో మాట్లాడారు. కౌన్సిల్ హాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టాలని గతంలోనే తీర్మానించామని అయితే ఇప్పుడు మాట్లాడిన కార్పొరేటర్ మొయిళ్ల గౌరి అప్పట్లో దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. సిఎం ఫోటో ఏర్పాటుకు నిబంధనలు ఉంటాయి కదా అని ఆమె ప్రశ్నించినట్లు తెలిపారు. అప్పటి కమిషనర్ దినేష్ కుమార్ కు తానే స్వయంగా నిబంధనలు పరిశీలించి ఫోటో ఏర్పాటు చేయాలని కోరినట్లు మేయర్ తెలియజేశారు. అప్పటి నుండి ఏర్పాటు చేయని అధికారులు ఇప్పుడు తనకు తెలియకుండా ఏర్పాటు చేశారని దానిపై తనకెందుకు చెప్పలేదని అధికారులను అడిగే సమయంలో కొందరు కార్పొరేటర్లు కావాలనే గొడవకు దిగారని మేయర్ స్రవంతి తెలియజేశారు. తన ఛాంబర్ లో సిఎం ఫోటో ఉందని, అలాంటప్పుడు కౌన్సిల్ హాల్లో ఉంటే తనకేం అభ్యంతరం ఉంటుందని స్పష్టం చేశారు. తాను చెప్పేది పూర్తిగా వినకుండా కేవలం రాజకీయ కక్ష్యలతో తనపై దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని… కేంద్ర, రాష్ట్ర ఎస్టీ కమిషన్లను కూడా ఆశ్రయిస్తానన్నారు. ఒక గిరిజన మహిళ మేయర్ అయిందన్న అక్కసుతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. దీనిపై న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తానని మేయర్ స్రవంతి తెలియజేశారు.

Read Previous

సిఎం ఫోటో వివాదం : రసాభాసగా నెల్లూరు కార్పొరేషన్ సమావేశం

Read Next

ఆ ముగ్గురు కార్పొరేటర్లపై మేయర్ నిరసన : పోలీసులకు ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published.