Clock Of Nellore ( Nellore ) – ముగ్గురు కార్పొరేటర్లు తనపై అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా తనపై దాడికి పాల్పడ్డారంటూ నెల్లూరు నగర మేయర్ పోట్లూరు స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. వారి చర్యలకు నిరసనగా సహచర కార్పొరేటర్లతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం ఆమె కార్పొరేషన్ కార్యాలయం నుండి దర్గామిట్ట పోలీస్ స్టేషన్ వరకూ పాదయాత్రగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దర్గామిట్ట సర్కిల్ ఇన్ స్పెక్టర్ సీతారామయ్యకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్లు మొయిళ్ల గౌరి, మూలే విజయభాస్కర్ రెడ్డి, బొబ్బల శ్రీనివాస యాదవ్ లు కౌన్సిన సమావేశం సందర్భంగా గిరిజన మహిళ అయిన తనను అవమానించడమే కాకుండా తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన సిఐ సీతారామయ్య విచారించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
