Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాకు నూతన కలెక్టర్ గా నియమితులైన యం. హరి నారాయణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరులోని కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ కు చేరుకుని వేద పండితుల ఆశీర్వచనం తర్వాత జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామినిని కూడా వారి నివాసంలో కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన కలెక్టరేట్ కు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటూ జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక, డిఆర్వో నారాయణమ్మ, కావలి ఆర్డీఓ శీనానాయక్, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు.
అనంతరం కలెక్టర్ హరి నారాయణన్ మీడియాతో మాట్లాడూతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సకాలంలో అర్హులైన అన్నీ వర్గాల ప్రజలకు అందించడంతో పాటూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మీడియా సహకారంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో ముఖ్యమైన రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్భర్ తదితర ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

