Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ నిఘా విభాగం అధిపతి సీతా రామాంజనేయులు అధికార దర్వినియోగానికి పాల్పడుతున్నారని, రాజకీయ దళారీగా వ్యవహరిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులను, ఎమ్మెల్యేలను వేధించడం తప్పా అధికార విధులేవి ఆయన నిర్వహించడం లేదని విమర్శించారు. నెల్లూరులోని తన కార్యాలయంలో మంగళవారం కోటంరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో ఈనాడు పత్రిక అధిపతి రామోజీరావుపై ఏపి సిఐడి అసత్య ఆరోపణలు చేస్తుందని, తమకు అన్యాయం జరిగిందని ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోయినా ఆయన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. సిఐడి చెబుతున్న మాటలను మార్గదర్శి ఖాతాదారులెవ్వరూ నమ్మడం లేదని, ఢిల్లీ వైసీపి ఎంపిలు రామోజీరావుపై బురదజల్లుతున్నా ఎవ్వరూ వినడం లేదని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రూటు మార్చి మంచిపేరున్న రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ తో రామోజీరావుపై విమర్శలు చేయించేందుకు కుట్ర చేస్తుందన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతా రామాంజనేయులుచే ఉండవల్లి అరుణ్ కుమార్ తో మాట్లాడించి ఢిల్లీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించారన్నారు. కేవలం రామోజీరావుపై బురద జల్లేందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఉసిగొల్పుతున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కు తాను ఏకలవ్య శిష్యుడినని, వైసిపి ట్రాప్ లో పడవద్దూ గురువు గారూ అంటూ విజ్ఞాపన చేశారు. రామోజీరావును వేధిస్తే లొంగుతారని అనుకోవడం ప్రభుత్వ అవివేకమని పేర్కొన్నారు. ఈనాడు, మార్గదర్శి నిజాయితీపై కావాలంటే తాను చర్చకు సిద్దమని, సాక్షి ఛానల్ కు రమ్మన్నా వస్తానని స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతా రామాంజనేయులు రహస్యంగా చేసిన ఈ ఆపరేషన్ తనకు ఎలా తెలిసిందోనన్న విషయంలో భయపడవద్దని, ఆయనకు ఎంత నెట్ వర్క్ ఉందో తనకు కూడా ఆయన వద్దనుండే ఫుల్ నెట్ వర్క్ ఉందని చెబుతూ మీ బాగోతం మరో 6 నెలల్లో ముగుస్తుందని కోటంరెడ్డి జోస్యం చెప్పారు.
