Clock Of Nellore ( Nellore ) – శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు దర్గామిట్టలో ఉన్న శబరి శ్రీరామ క్షేత్రంలో సీతా రాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కుటుంబ సమేతంగా హాజరయ్యి స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సీతా రాముల ఉత్సవ విగ్రహాలను కళ్యాణోత్సవ వేదికైన సమీపంలోని వేమాలశెట్టి బావి సత్రం ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన సతీమణి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆయన సతీమణి, ఇద్దరు పిల్లలు పాల్గొన్నారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తలపై మోస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు చేరుకోగా అర్చకులు సీతా రాముల ఉత్సవ విగ్రహాలను వేదికపైకి చేర్చి కళ్యాణ తంతును మొదలుపెట్టారు. భక్తుల జయజయ ధ్యానాల మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ముగించారు. అనంతరం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా శబరి శ్రీరామ క్షేత్రం ఆధ్వరంలో శ్రీ రామ నవమి రోజున సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. క్రమం తప్పకుండా అత్యంత కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న చింతలపల్లి నాగేశ్వర రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ధర్మ రక్షణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకెళ్లాలనే విషయాన్ని ఆచరణలో చూపిన శ్రీరాముని జీవితం ప్రస్తుత సమాజానికి ఆదర్శనీయమన్నారు. మరో వైపు ఈ కళ్యాణ మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ కూడా పాల్గొన్నారు. కళ్యాణోత్సవం అనంతరం సీతారాములను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు అజీజ్ ను దీవించారు.

