తనను అస్థిర పరిచే కుట్ర : రెచ్చగొట్టినా స్పందించవద్దన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొందరు ప్రత్యర్ధులు తనను అస్థిర పరిచే కుట్రలు చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టింగులు పెడుతున్నారన్నారు. ఆ పోస్టుల పట్ల తాను గానీ, తనను అభిమానించే కార్యకర్తలు గానీ స్పందిస్తే దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా నేతలు, కార్యకర్తలు, అభిమానులు రెచ్చిపోవద్దని, అసలే స్పందించనే వద్దని విజ్ఞప్తి చేశారు. మితిమీరితే న్యాయపరంగా పోరాటం చేద్ధామని పిలుపునిచ్చారు.

నెల్లూరులోని వారి కార్యాలయంలో గురువారం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంభందించి అన్నీ సర్వేలు తనకు అనుకూలంగానే ఉన్నాయన్నారు. ప్రజల ఆశీస్సులతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాయని, 2024లో కూడా ప్రజల దీవెనలతో మూడో సారి కూడా ఎమ్మెల్యే అవుతానని స్పష్టం చేశారు. దీన్ని ఓర్వలేని కొందరు ప్రత్యర్ధులు తన కుటుంబంలోని మహిళలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగులు పెడుతున్నారని వివరించారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా తనకు అభిమానులు ఉన్నారని, ఈ పోస్టుల పట్ల అభిమానులెవ్వరూ స్పందించవద్దన్నారు. ఆ పోస్టులకు కామెంట్లు కూడా పెట్టవద్దన్నారు. మితిమీరితే న్యాయపరంగా పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేశారు. తాను, తన సోదరుడు గిరిధర్ రెడ్డి ప్రజా జీవితంలో ఉన్నామని, తమను ఎన్ని తిట్టినా భరిస్తామని, కుటుంబంలో మహిళలను తిడితే ఎవరు ఓర్చుకుంటారని ప్రశ్నించారు. తనను రాజకీయంగా వ్యతిరేకించే కొన్ని పార్టీల నేతలు, కొందరు వ్యక్తులు ఈ విధంగా రెచ్చగొట్టి, తనను రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ పోస్టింగులను చూసి భరించలేని తన అభిమానులు ఏదైనా చేస్తే దాన్ని భూచిగా చూపించి ప్రజల్లో తనను పలుచన చేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ రాజకీయ ఉచ్చులో తనతో నడిచే నేతలు, కార్యకర్తలు, అభిమానలు పడవద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచించారు. నిద్రపోతున్నప్పుడు మినహా మిగిలిన అన్నీ సమయాల్లో ప్రజలకు ఎలా చేరువ కావాలి, ప్రజల సంక్షేమం కోసం ఏం చేయాలి, అభివృద్ది పనులపైనే తాను ఆలోచిస్తానని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఈ రాజకీయ కుతంత్రులకు బుద్ధి చెబుతామని కోటంరెడ్డి కేడర్ కు పిలుపునిచ్చారు.

Read Previous

మెడికవర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కాకాణి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

Read Next

దూసుకొస్తున్న మాండౌస్ తుఫాను : ఉమ్మడి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

Leave a Reply

Your email address will not be published.