వీడు మహా కేటుగాడు : కటకటాల వెనక్కు నెట్టిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – వీడు మహా కేటుగాడు. అంతా ఇంతా కాదు.. తాను పెద్ద అధికారినని, పెద్ద డాక్టర్ నని ప్రజలను బురిడీ కొట్టించి నగదుతో ఉడాయిస్తాడు. ఒకరూ, ఇద్దర్నీ కాదూ ఏకంగా పదుల సంఖ్యలో ఈ మోసాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు నెల్లూరు పోలీసుల వలలో చిక్కి కటకటాల వెనక్కు వెళ్లాడు. వివరాల్లోకి వెళ్లితే నెల్లూరుజిల్లా, కావలి మండలం, పట్టపుపాళెంకు చెందిన వాయిల వెంకటేశ్వర్లు ఎంబిఎ చదివాడు. హైదరాబాద్ లోని ఇన్ఫోటెక్ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కూడా చేశాడు. జల్సాలకు అలవాటు పడ్డ వెంకటేశ్వర్లు ఉద్యోగం మానేసి మాయగాడి వేషం వేశాడు. 2018వ సంవత్సరం నుండి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తాను ట్రైనీ ఐఏఎస్ నని, రైల్వే టిసి అని, డాక్టర్ అని ఏరియాను బట్టి పరిచయాలు పెంచుకునే వాడు. బంగారు దుకాణాల్లో నగలు తీసుకొని ఆఫీస్ వచ్చి డబ్బు తీసుకోవాలని చెప్పేవాడు. తీరా వారు అక్కడికెళ్తే అతనెవరో తమకు తెలియదని చెప్పడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేవారు. ఈనెల 17వ తేదీ కూడా నెల్లూరు రంగనాయకుల పేట రైల్వేగేటు వద్ద ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి బైక్ ను లాక్కున్నాడు. తాజాగా సంతపేట పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా అటుగా వచ్చిన ఈ మాయగాడు పోలీసులను చూసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతని వద్ద వివిధ ఐడి కార్డులు బయటపడ్డాయి. ట్రైనీ ఐఏఎస్, డాక్టర్, రైల్వే టీసీ ఇలా ఏది కావాలంటే ఆ నకిలీ ఐడిలు బయటపడటంతో ఇతగాడి గురించి పూర్తి స్థాయిలో విచారించగా గతంలోనే ఇలాంటి మోసం కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటతిరుగుతున్నట్లు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసిన సంతపేట సిఐ అన్వర్ బాషా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అతని నుండి 7 లక్షలు విలువ జేసే బైక్, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అన్వర్ బాషా తెలిపారు.

Read Previous

చంద్రబాబు ట్రాప్ లో పడకండి : ప్రజలకు వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి పిలుపు

Read Next

అపోలో ఆధ్వర్యంలో న్యూరో ఎసెన్షియల్ CME సదస్సు : హాజరైన వివిధ రాష్ట్రాల వైద్యులు

Leave a Reply

Your email address will not be published.