రేపే నెల్లూరులో కార్తీక మహా దీపోత్సవం: హాజరుకానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో సోమవారం కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం జరగనుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారధ్యంలో మూలాపేటలోని శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సన్నిధి ప్రాంగణంలో ఉన్న గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద ఈ కార్యక్రమం కొనసాగనుంది. నెల్లూరు చరిత్రలో ఇప్పటి వరకూ ఎప్పుడూ జరగని విధంగా ఈ మహా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివిధ ఏర్పాట్లను చేపట్టారు. సోమవారం ఉదయం ఘాట్ వద్ద తాత్కాలిక శివలింగాన్ని వేద పండితులు ఏర్పాటు చేయనున్నారు. యజ్ఞ యాగాదులు నిర్వహించే ఆ శివలింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించారు. గోపూజ, మహాన్యాస పారాయణం, శివాభిషేకం, రుద్ర హోమం, ప్రసాద వితరణ కార్యక్రమాలను ఉదయం ఘాట్ వద్ద నిర్వహించనున్నారు.

సాయంత్రం 4 గంటల నుండి కనీవినీ ఎరుగని కార్యక్రమాలను రూపకల్పన చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వేద మంత్రోచ్ఛరణల మధ్య వివిధ కార్యక్రమాలు జరగనున్నారు. 1008 మంది మహిళలతో కార్తీక దీపోత్సవ విశిష్ఠ శోభాయాత్ర నగరంలో జరగనుంది. మహిళా కోలాటాలు, కేరళ వాయిద్యాలతో ఈ శోభాయాత్ర గణేష్ నిమజ్జన ఘాట్ వరకూ సాగనుంది. సాయంత్రం 6 గంటలకు హరిద్వార్ నుండి వచ్చిన వేద పండితులు గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులపై దేశంలోని 12 పుష్కర పవిత్ర నదుల నుండి తీసుకొచ్చిన జలాలను డ్రోన్ల ద్వారా సంప్రోక్షణ చేయనున్నారు. శంఖానాథ కార్యక్రమాన్ని కూడా వేదపండితుల ద్వారా నిర్వహించనున్నారు. అదే సమయంలో నెల్లూరు చెరువులో 50 మంది మత్య్సకారులు శివనామ స్మరణ చేస్తూ కాగడాలను చేత బూని పడవలతో శివలింగం ఆకృతిగా ఏర్పడనున్నారు. గరికపాటి నరసింహారావుచే ప్రవచన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పరిపూర్ణనంద స్వామితో పాటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె ఇమ్మడి దీపా వెంకట్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భారత రక్షణ శాఖ సలహాదారులు డాక్టర్ జి. సతీష్ రెడ్డి, ఇతర నగర ప్రముఖులు పాల్గొననున్నారు. సోమవారం జరిగే కార్యక్రమాల నేపద్యంలో ఆదివారం మొత్తం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారి అనుచర గణం మొత్తం గణేష్ ఘాట్ వద్దే ఉండి ఏర్పాట్లు పరిశీలించారు.

Read Previous

అభివృద్ధి ప్రజలకు వేగంగా చేరువ కావాలి : అన్నీ శాఖల అధికారులకు జడ్పీ ఛైర్ పర్సన్ సూచన

Read Next

ఈ ప్రాంత వాసిగా గర్విస్తున్నా ! : ఆత్మకూరు సభలో రక్షణ శాఖ సలహాదారులు సతీష్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published.