Clock Of Nellore ( Atmakur ) – రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు, విద్యార్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. నెల్లూరుజిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం, మహిమలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో భాను, రామకృష్ణన్, డా చిత్ర, వెంకట్రామన్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో శంకర నేత్రాలయం కంటి వైద్యశాల, చెన్నై వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పొర చికిత్స శిబిరంలో పాల్గొని సంచార కంటి శస్త్రచికిత్స యూనిట్లను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ నివాస్, ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, రక్షణ శాఖ సలహాదారులు డా. జి. సతీష్ రెడ్డితో కలసి ప్రారంభించారు.

ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించాలన్న సంకల్పంతో రక్షణ శాఖ సలహాదారులు డా. జి. సతీష్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించి అనేక మంది దేశ స్థాయిలో ఉన్నత పదవుల్లో వున్నారని, వారిలో డా. జి. సతీష్ రెడ్డి ఒకరని అన్నారు. ఈ పాఠశాలను మరింతగా అభివృద్ది చేయాలని కోరడం జరిగిందని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా మనబడి నాడు – నేడు కార్యక్రమం క్రింద పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టడం జరుగుచున్నదన్నారు. అందులో భాగంగా జిల్లాలో రెండో విడత నాడు – నేడు కార్యక్రమం క్రింద 1385 పాఠశాలల్లో 468 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ గ్రామంలో 47 లక్షల రూపాయలతో 5 అదనపు తరగతి గదులు మంజూరు చేయడం జరిగిందన్నారు. దేశ రక్షణకు డా. జి. సతీష్ రెడ్డి చేస్తున్న కృషి, సేవలు ఎనలేనివని, కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ఆయన అందచేసిన సహకారం మరవలేనిదన్నారు. నేడు ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మనిషికి ఆరోగ్య పరీక్షలు అవసరమని, ముఖ్యంగా కంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం వుందన్నారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ నివాస్ మాట్లాడుతూ, డి.ఆర్.డి.ఓ ఛైర్మన్ గా, రక్షణ శాఖ సలహాదారునిగా దేశ రక్షణకు ఈ ప్రాంత వాసి అయిన డా. సతీష్ రెడ్డి చేస్తున్న సేవలు, నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. ఈ గ్రామంలో వున్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించడం జరిగిదని, ఈ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్స్ కోరిన విధంగా సమావేశ హల్ ను ఏర్పాటు చేయుటకు 9 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు వైద్య పరీక్షల కోసం బయటకు వెళ్లకుండా ఈ ప్రాధమిక కేంద్రంలోనే 60 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా అవసరమైన వైద్య పరికరాలను, వైద్య సిబ్బందిని మంజూరు చేస్తున్నట్లు కమిషనర్ నివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రజలు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆత్మకూరు శాసన సభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ద్వారా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో 90 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఈ నియోజక వర్గాన్ని అనీ రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నత స్థాయిలో ఉన్న ఈ ప్రాంత వాసులు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.

రక్షణ శాఖ సలహాదారులు డా. జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీ వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ ప్రాంత చుట్టు ప్రక్కల గ్రామాల సర్పంచులు కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఆయా గ్రామాల ప్రజలు కంటి పరీక్షలు చేయించుకునేలా చూడాలని డా. సతీష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ, ఎస్. వి యూనివర్సిటీ ప్రొఫెసర్ రామిరెడ్డి, శంకర నేత్రాలయం వైద్యశాల, చెన్నై ప్రతినిధులు డా. అరుణ్ కుమార్, ఆత్మకూరు ఆర్.డి.ఓ కరుణకుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, ఆత్మకూరు మునిసిపల్ కమీషనర్ రమేష్ కుమార్, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఉషారాణి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
