Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సకాలంలో చేరేలా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన గ్రామీణాభివృద్ది, వ్యవసాయ, విద్య, వైద్యం, స్త్రీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ, ప్రణాళికా మరియు ఆర్ధిక విషయాల పనులపై స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. ఈ స్థాయీ సంఘాల సమావేశాల్లో ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల వివరాలను వివరించడంతో పాటు ఆయా కార్యక్రమాల పనుల పురోగతిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కు, ఆయా స్థాయీ సంఘాల్లో సభ్యులుగా వున్న జడ్.పి.టి.సి సభ్యులకు సంబందిత శాఖల అధికారులు వివరించారు.
ఈ సంధర్భంగా జడ్.పి. చైర్ పర్సన్ అరుణమ్మ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వాటిని ప్రజలకు సకాలంలో అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి అధికారులు కృషి చేయాలన్నారు. స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యులు సూచించిన అంశాలను, పనులను సంబందిత శాఖల అధికారులు పరిగణలోకి తీసుకొని ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జడ్పి చైర్ పర్సన్ అరుణమ్మ, అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల వివరాలను సంబందింత జడ్.పి.టి.సి.లకు, ఇతర ప్రజా ప్రతినిధులకు కచ్చితంగా తెలియచేయాలని ఆమె, అధికారులకు సూచించారు.

తొలుత గ్రామీణాభివృద్ది విషయాలపై జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో జిల్లా నీటి యాజ్యమాన్య సంస్థ అధ్వర్యంలో జరుగుచున్న అభివృద్ది కార్యక్రమాలను ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వివరిస్తూ 2022-23 సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో 5.31 లక్షల జాబ్ కార్డ్స్ జారీచేయడం జరిగిందని, 2022-23 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు 1.83 లక్షల కూలీ కుటుంబాలకు 80 లక్షల పని దినాలు కల్పించి, వేతనం కింద 162.59 లక్షల రూపాయలు, సామాగ్రి క్రింద 64.83 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. అలాగే జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం కింద 2021-22 ఆర్ధిక సంవత్సరంలో హార్టికల్చర్ ప్లాంటేషన్ కింద 1852 ఎకరాలలో పండ్ల మొక్కలను పెంచి 1.98 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధ్వర్యంలో పేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాలను సంబందిత శాఖ అధికారులు వివరిస్తూ, పేద మహిళలు ఆర్ధిక స్వావలంభన సాధించాలనే ఉద్దేశ్యంతో ఏ రాష్ట్రంలో లేని విధంగా బ్యాంకుల ద్వారా సున్నా వడ్డీకే రుణ సహాయాన్ని అందచేయడం జరుగుచున్నదని, 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 6,433 స్వయం సహాయక సంఘాలకు 544.32 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ కింద రుణ సహాయాన్ని అందచేయడం జరిగిందని వివరించారు. అంతేకాకుండా వైఎస్.ఆర్.సున్నా వడ్డీ, వైఎస్.ఆర్. ఆసరా, వైఎస్.ఆర్. చేయూత, జగనన్న జీవక్రాంతి, జగనన్న పాలా వెల్లువ, జగనన్న తోడు, వైఎస్.ఆర్. భీమా, స్త్రీ నిధి, వైఎస్.ఆర్. పెన్షన్ కానుక వంటి అనేక కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నదని వివరించారు.

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు కృషిచేయడం జరుగుచున్నదని జిల్లా పరిశ్రమల అధికారి తెలుపుతూ, పరిశ్రమల శాఖ ద్వారా ప్రజలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల వివరాలను జడ్.పి. చైర్ పర్సన్ కు, సంబందిత కమీటీల జడ్.పి.టి.సి సభ్యులకు వివరించారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా 2021-22 సంవత్సరంలో పరిశ్రమల ఏర్పాటుకు 900 ధరఖాస్తులు రాగా, 891 అనుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం వ్యవసాయ విషయాలపై జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో పశు సంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ వివరిస్తూ, సామాన్య రైతులకు పశు వైద్యంను అందుబాటులోకి తెచ్చుటకు రాష్ట్ర ప్రభుత్వం పశు సంచార వాహనాలను అందుబాటులోకి తేవడం జరిగిందని, జిల్లాలోని అన్నీ నియోజక వర్గాల్లో పశు సంచార వాహనాలను ఏర్పాటుచేయడం జరిగిందని, ఇందుకు గాను 1962 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటలు ఈ సేవలను అందుబాటులో వుంచి పశు సంక్షేమానికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో చాలా వరకు పశు వైద్యశాలల భవనాలు పాడైపోయి శిధిలావస్థకు చేరుకున్నాయని, వీటి స్థానంలో నూతన భవన నిర్మాణాలను చేపట్టాల్సిన అవసరం వుందని జడ్పిటిసి సభ్యులు సమావేశం దృష్టికి తీసుకు రాగా, జిల్లాలో 35 పశు వైద్యశాలలకు సంబంధించి నూతన భవన నిర్మాణాలకు ప్రతి పాదనలు పంపడం జరిగిందని జాయింట్ డైరెక్టర్, సభ్యులకు తెలియచేయడం జరిగింది. ఈ సంధర్భంగా వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, ఎపిఎంఐపి ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సంబంధింత అధికారులు వివరించారు.
తదుపరి జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో విద్య, వైద్య సేవలపై కమిటీ చర్చిండం జరిగింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అంధిస్తున్న వైద్య సేవల గురించి వివరిస్తూ, వర్షాకాలం మొదలైనందున సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జడ్.పి. చైర్ పర్సన్ కు, సంబందిత కమీటీల జడ్.పి.టి.సి సభ్యులకు వివరించారు. విధ్యా శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆ శాఖ అధికారులు వివరిస్తూ, మనబడి నాడు – నేడు కింద రెండవ విడతలో 1,385 పాఠశాలలను ఎంపిక చేసి 468.558 కోట్ల రూపాయలతో 2044 అదనపు తరగతి గదులను ఆధునీకరించేందుకు పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. తదుపరి స్త్రీ సంక్షేమ విషయాలు, సాంఘిక సంక్షేమ విషయాలు, ప్రణాళికా మరియు ఆర్ధిక విషయలు, పనుల విషయాలపై జరిగిన స్థాయీ సంఘ సమావేశాలల్లో సంబందిత శాఖల అధికారులు క్షుణ్ణంగా ఆయా శాఖల ద్వారా చేపడుతున్న పనులు, వాటి పురోగతిపై జడ్.పి. చైర్ పర్సన్ కు, సంబందిత కమీటీల జడ్.పి.టి.సి సభ్యులకు వివరించారు.

తొలుత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన వెంకటగిరి జడ్.పి.టి.సి సభ్యులు కోలా వెంకటేశ్వర్లు మృతి పట్ల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, స్థాయీ సంఘ సభ్యులు, అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ శ్రద్దాంజలి ఘటించారు. ఈ స్థాయీ సంఘ సమావేశాల్లో జిల్లా పరిషత్ సి.ఈ.ఓ చిరంజీవి, డ్వామా పి.డి. వెంకట్రావు, జిల్లా పరిశ్రమల అధికారి ప్రసాద్ రావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సుధాకర్ రాజు, పశుసంవర్ధక శాఖ జెడి. మహేశ్వరుడు, మత్స్య శాఖ జె.డి నాగేశ్వర రావు, ఎపిఎంఐపి పిడి శ్రీనివాసులు, జిల్లా ఉద్యాన శాఖాధికారి సుబ్బారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పెంచలయ్య, సర్వశిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఉషా రాణి, ఐసిడిఎస్ పి.డి సౌజన్య, సంబందిత శాఖల అధికారులు, స్థాయీ సంఘాల్లో సభ్యులుగా వున్న జడ్.పి.టి.సి సభ్యుకు తదితరులు పాల్గొన్నారు.