Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా పౌర సరఫరాల శాఖలో వెలుగుచూసిన కుంభకోణం వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని, ఈ కుంభకోణంలో దోషులను తేల్చేందుకు సిబిఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు పౌరసరఫరాల శాఖలో ఇటీవల వెలుగుచూసిన కుంభకోణం 30 కోట్లు కాదని, వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అన్నారు. ఉలవపాడు రైతులు ధాన్యానికి సంభందించిన చెల్లించాల్సిన 2 కోట్ల కోసం సోమవారం ఏకంగా కలెక్టర్ ఎదుట బైటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సీజన్ అయిపోయి 4 నెలలు పూర్తయినా రైతులకు చెల్లించాల్సిన నగదు ఇంకా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. నెల్లూరులో వెలుగు చూసిన కుంభకోణంలో ప్రభుత్వం డబ్బు చెల్లించినా బియ్యం మాయమైనటువంటి ఆశ్యర్యకరమైన అంశాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇంత పెద్ద అవినీతికి పాల్పడే ధైర్యం అధికారులకు లేదని, దీని వెనుక పెద్ద మనుషుల హస్తం ఉంటుందని ఆరోపించారు. ఈ అవినీతిలో సూత్రధారులు, పాత్రధారులెవరో తేలాలంటే సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సిబిఐ విచారణ చేయకుంటే ఈ కుంభకోణంలో సిఎం జగన్ కూ భాగం ఉన్నట్లేనని సోమిరెడ్డి అన్నారు. నెల్లూరులో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగితే వ్యవసాయశాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సిబిఐ విచారణకు ఆదేశించకుంటే తెలుగుదేశం పార్టీ దీనిపై పోరాటం చేస్తుందని హెచ్చరించారు.