Clock Of Nellore ( Nellore ) – అనంతపురం JNTU పరిధిలోని బీ ఫార్మసీ విద్యార్ధులకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం యత్నిస్తుందని తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ( TNSF ), అఖిల భారత విద్యార్ధి పరిషత్ ( ABVP ) ధ్వజమెత్తాయి. విద్యార్ధులకు న్యాయం చేయాలని కోరుతూ నేతలు నెల్లూరులో ఆందోళన నిర్వహించారు. నగరంలోని విఆర్సీ సెంటర్ లో రెండు విద్యార్ధి సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా TNSF జిల్లా అధ్యక్షులు షేక్ అమ్రుల్లా మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా దీవెన నిధులను మిగుల్చుకునేందుకు డీటెండ్ అమలు చేస్తుందన్నారు. బీ ఫార్మసీ కోర్సులో భాగంగా మొదటి సంవత్సరంలో సబ్జెక్టులు మిగిలితే… ఎలాంటి షరతులు లేకుండా రెండో సంవత్సరానికి ప్రమోట్ చేసేవారని, రెండో ఏడాది పరీక్షల్లో మొదటి ఏడాది తప్పిన సబ్జెక్టుల పరీక్షలు రాసేవారన్నారు. తాజాగా JNTU అధికారులు మొత్తం సబ్జెక్టులు పూర్తయితే తర్వాత ఏడాదికి ప్రమోట్ చేస్తామని ఉత్తర్వులు జారీ చేసిందని, దీని వల్ల 2700 మంది బీ ఫార్మసీ విద్యార్ధులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలోని ఏ యూనివర్శిటీలో ఈ విధానం లేదన్నారు. కేవలం విద్యా దీవెన నిధులు మిగుల్చుకునేందుకు ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని అమ్రుల్లా విమర్శించారు. తక్షణం డీటెండ్ విధానాన్ని వెనక్కు తీసుకోవాలని లేదంటే యూనివర్శిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు.