Clock Of Nellore ( Nellore Rural ) – పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నెల్లూరు జిల్లాలో 1,95,866 మంది రైతుల ఖాతాల్లో రూ.110.97 కోట్లు ప్రభుత్వం జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. శుక్రవారం నెల్లూరు రూరల్ మండలం పొట్టెపాలెం గ్రామంలో నిర్వహించిన పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం కిసాన్ 22వ విడత కింద 1,63,125 మంది రైతులకు రూ.32.63 కోట్లు, అలాగే అన్నదాత సుఖీభవ మూడో విడత కింద 1,95,866 మంది రైతులకు రూ.78.35 కోట్లు విడుదల అవుతున్నట్లు చెప్పారు. ఈ రెండు పథకాల ద్వారా మొత్తం రూ.110.97 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు వివరించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తోందన్నారు. రైతులకు అవసరమైన సమయంలో నిధులు అందించడం ఎంతో ముఖ్యమని, ప్రస్తుతం పంట కోతల సమయంలో ఈ డబ్బులు రైతులకు ఉపయోగపడతాయని కలెక్టర్ చెప్పారు.
జిల్లాలో ఈ ఏడాది రైతులు ఎంత ధాన్యం అందించినా ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో సుమారు 113 టీఎంసీల నీరు సమృద్ధిగా నిల్వ ఉన్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో వర్షాలు తక్కువగా వచ్చినా కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే నీటిని నిల్వ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం సోమశిల, కండలేరు జలాశయాలు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల మరమ్మతులు చేపట్టడంతో రైతాంగానికి మేలు జరుగుతుందని వివరించారు. జిల్లాలో సుమారు 2,500 ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ద్వారా పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఐదు సెంట్ల పొలంలో ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని, ఉద్యానవన పంటల సాగుకు మొక్కలను కూడా నరేగా ద్వారా అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ… వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగంపై ప్రత్యేక అధ్యయనం కోసం ఒక ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా “ఛాంపియన్ ఫార్మర్” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని, ప్రతి విషయంలోనూ రైతులకు మేలు కలిగేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనంతరం పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకాల మెగా చెక్కులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
