Clock Of Nellore ( Amaravati ) – ముగ్గురు వైసీపి ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి నెల్లూరుజిల్లాకు చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తితో పాటూ కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ లు చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముగ్గురు ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు గతంలోనే వైసీపికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేసి ఉన్నారు. అయితే రాజీనామాలపై మండలి ఛైర్మైన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వారు మండలి సమావేశాలకు హాజరవుతున్నారు. టిడిపిలో చేరికపై ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ తమ హక్కులను మండలి ఛైర్మైన్ కాలరాస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ పదవికి తాను 13 నెలల క్రితమే రాజీనామా చేసినా ఇంతవరకూ నిర్ణయం తీసుకోకపోవడం ఏంటని మండలి ఛైర్మైన్ ను ప్రశ్నించారు. తమ ముగ్గురి రాజీనామాలు ఆమోదిస్తే మండలిలో వైసీపి ప్రతిపక్ష హోదా కోల్పోతుందనే ఉద్దేశ్యంతోనే ఛైర్మైన్ నిర్ణయాన్ని దాటవేస్తూ వస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంట నడిచేందుకే తాము తెలుగుదేశం పార్టీలో చేరామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మండలి ఛైర్మైన్ నిర్ణయం ప్రకటించాలన్నారు.
