- అపోలో హాస్పిటల్ 5 ఏళ్ల బాలికకు అరుదైన శస్త్ర చికిత్స
- కీ హోల్ పద్దతిలో మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించిన వైద్యులు
- నెల్లూరులో మొట్ట మొదటి సారిగా విజయవంతంగా చేసిన అపోలో వైద్యులు
- అపోలో హాస్పిటల్ లో అధునాతనమైన వైద్య పరికరాలు
- వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ వెంకట్
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో 5 ఏళ్ల చిన్నారికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన అదునాతన పద్దతుల్లో శస్త్ర చికిత్స నిర్వహించి ఆ చిన్నారికి పునర్ జన్మను ప్రసాదించారు. నెల్లూరులో ఈ తరహా శస్త్ర చికిత్స నిర్వహించడం ఇదే ప్రధమం అని వైద్యులు పేర్కొన్నారు. దీనిపై బుధవారం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్, న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్, హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన 5 ఏళ్ల చిన్నారికి రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలు కాగా నెల్లూరు అపోలో హాస్పిటల్ ఎమర్జెన్సీ కి వారి కుటుంబసభ్యులు తీసుకొచ్చారన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని ఐసియూలో ఉంచి మరుసటి రోజు సీటి స్కాన్ ద్వారా పరీక్షించగా కుడివైపు మెదడులోని ముఖ్య భాగంలో రక్తం గడ్డ కడుతూ ఉండటాన్ని గుర్తించామన్నారు. తక్షణం శస్త్ర చికిత్స నిర్వహించాలని వారి కుటుంబసభ్యులకు తెలియజేయగా వారి అంగీకారంతో అదునాతన పద్దతుల్లో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. సాధారణంగా అయితే ఇలాంటి రోగికి పుర్రెలో ఎక్కువ భాగం ఎముకను తొలగించి ఈ తరహా ఆపరేషన్లు చేస్తారని, అలా చేస్తే రోగి కోలుకోవడానికి ఎక్కువ రోజులు సమయం పడటమే కాకుండా రక్త స్రావం కూడా అధికంగా ఉంటుందని అన్నారు.
నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అధునాతన వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తద్వారా ఈ బాలికకు minimally image approach విధానం అంటే కీ హోల్ పద్దతి ద్వారా శస్త్ర చికిత్సను నిర్వహించినట్లు వైద్యులు తెలియజేశారు. ఈ పద్దతి ద్వారా ఎండోస్కోపి, మైక్రోస్కోపిని ఉపయోగించి అతి చిన్న కత్తితో మెడడులో గడ్డ కట్టిన రక్తాన్ని పూర్తిగా తొలగించినట్లు డాక్టర్ శ్రీరాం సతీష్, డాక్టర్ వెంకట్ పేర్కొన్నారు. ఈ తరహా శస్త్ర చికిత్సను నిర్వహించడం నెల్లూరులో ఇదే ప్రధమం అని తెలియజేశారు. ఈ కీ హోల్ విధానం ద్వారా శస్త్ర చికిత్స చేయడంతో బాలిక కేవలం గంటల వ్యవధిలోనే కోలుకుందని, రెండు రోజుల్లోనే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో బాలికతో పాటూ న్యూరో విభాగం వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
