వైసీపి ఫిర్యాదు ” తూచ్ ” : తిరస్కరిస్తున్నట్లు తెలిపిన జేసీ కార్తీక్

Clock Of Nellore ( Nellore ) – ఈనెల 3వ తేదీన జరిగిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో పార్టీ విప్ ను ధిక్కరించి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన తహసీన్ కు ఓటు వేసిన 40 మంది వైసీపి కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి కార్తీక్ కు ఆపార్టీ నేతలు అందజేసిన వినతి పత్రం తిరస్కరణకు గురైంది. పలు సాంకేతిక లోపాలను ప్రస్తావిస్తూ వినతి పత్రాన్ని తోసిపుచ్చినట్లు శుక్రవారం జాయింట్ కలెక్టర్ కార్తీక్ స్పష్టం చేశారు. తిరస్కరణకు సంభందించిన లేఖను వైసీపి విప్ అయిన ఊటుకూరు నాగార్జునతో పాటూ కార్పొరేటర్లకు పంపారు. నెల్లూరు నగర పాలక సంస్థకు సంభందించి మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. అన్నీ డివిజన్లలో వైసీపి అభ్యర్ధులే కార్పొరేటర్లుగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం తర్వాత దాదాపు 40 కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఈ నేపద్యంలో వైసీపి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ అప్పట్లో డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా నేపద్యంలో 2వ డిప్యూటీ మేయర్ పదవి ఖాళీగా ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 3వ తేదీనా ప్రిసైడింగ్ అధికారిగా నియమితులైన జాయింట్ కలెక్టర్ కార్తీక్ డిప్యూటీ మేయర్ ఎన్నికను చేపట్టారు. ఈ ఎన్నికలో వైసీపి కూడా అభ్యర్ధిని నిలబెట్టింది. కరీముల్లాను డిప్యూటీ మేయర్ అభ్యర్ధిగా పోటీకి దించారు. తెలుగుదేశం పార్టీ సయ్యద్ తహసీన్ ను డిప్యూటీ మేయర్ రేసులో ఉంచారు. ఈ ఎన్నికకు మేయర్ స్రవంతితో పాటూ మరో కార్పొరేటర్ గైర్హాజరవ్వగా మిగిలిన 52 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. 40 మందికి పైగా కార్పొరేటర్లు చేతులెత్తి తమ మద్దతు తెలపడంతో టిడిపి అభ్యర్ధిని సయ్యద్ తహసీన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.

దీనిపై వైసీపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైసిపిలో ఉన్న కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీపై పలు విమర్శలు చేశారు. తర్వాత ప్రిసైడింగ్ అధికారి కార్తీక్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. వైసీపి అభ్యర్ధి కరీముల్లాకు ఓటు వేయాలని పార్టీ తరపున విప్ జారీ చేసినా దాన్ని ఉల్లంఘించి 40 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి ఓటు వేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని, వారిపై అనర్హత వేటు వేయాలని లేఖను అందజేశారు. లేఖ అందుకున్న ప్రిసైడింగ్ అధికారి 40 మంది కార్పొరేటర్లతో పాటూ గైర్హాజరయిన మేయర్ స్రవింతికి మరో కార్పొరేటర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారంలో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదే తరుణంలో శుక్రవారం ప్రిసైడింగ్ అధికారి కార్తీక్ మరో లేఖను వైసీపి విప్ అయిన నాగార్జునకు, 42 మంది కార్పొరేటర్లకు దాని ప్రతులను పంపారు. వైసీపి విప్ నాగార్జున తనకు అందజేసిన వినతి పత్రాన్ని తిరస్కరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. విప్ జారీలో నిబంధనలు పాటించలేదని, నిబంధనల ప్రకారం విప్ జారీ విషయాన్ని లేఖ ద్వారా తనకు అందజేయలేదని అందుకే వినతి పత్రాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్ వినతి పత్రాన్ని తిరస్కరించడంతో 42 మంది కార్పొరేటర్లపై ఎలాంటి చర్యలు తీసుకునే వీలుండదు.

Read Previous

ఆన్ లైన్ పేమెంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి : VSU వైస్ ఛాన్సలర్ విజయభాస్కర్

Read Next

నెల్లూరు రూరల్ లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల జాతర…

Leave a Reply

Your email address will not be published.