Clock Of Nellore ( Atmakuru ) – గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని మోస్తూ… ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణం అంబేద్కర్ నగర్ లో పండగ వాతావరణంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేసిన మంత్రి ఆనం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అమలు చేశారని మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా మరో అడుగు ముందుకేసి మహిళలకు ప్రతి ఏడాది ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు మంత్రి చెప్పారు.
గత ప్రభుత్వం మిగిల్చిన 11 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తూ కూడా కోట్లాది రూపాయల ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టి మహిళలకు దీపావళి కానుక ప్రకటించిన మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా దీపం-1 పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలకు ఉచితంగా గ్యాస్ స్టవ్ లు, సిలిండర్లు అందించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్న మంత్రి, ఇప్పుడు మళ్లీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేయడం పట్ల రాష్ట్రంలోని మహిళలందరి తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ప్రభుత్వం ఉచితంగా అందిస్తామని, సిలిండర్ బుక్ చేసుకున్న 48 గంటల్లోగా వినియోగదారులు చెల్లించిన డబ్బులు మొత్తం వారి ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి చెప్పారు. ఆత్మకూరు పట్టణంలో 23313, జిల్లాలో 406552 మంది వినియోగదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. కోట్లాది రూపాయల ఖర్చును భరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకుని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తమ ఆశీస్సులు అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో పావని, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ, ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
- Anam Ramanarayana Reddy
- Minister Anam
- Free Gas Cylinders Distribution in AP