Clock Of Nellore ( Nellore ) – ఎముకలు గుల్లబారడం ( ఆస్టియోపోరోసిస్ ) వ్యాధిపై అవగాహన పెంచుకోకపోతే జీవితాంతం వికలాంగులుగా మారే ప్రమాదం ఉందని నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ బి.ఎల్.ఎస్. కుమార్ బాబు, సీనియర్ ఆర్ధోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్ డాక్టర్ కె. శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీనా ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ లో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఎముకల్లో చేవ తగ్గిపోయి, ధృఢత్వం కోల్పోయి, బోలుగా మారడాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటారని తెలిపారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం వికలాంగులుగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ప్రతీ ఏటా అక్టోబర్ 20వ తేదీన ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవంగా జరుపుకుంటారని వివరించారు. ఈ వ్యాధి ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా అటాక్ చేస్తుందని, 50 ఏళ్లు పైబడిన ప్రతీ ముగ్గురిలో ఒకరు, ప్రతీ ఐదు మంది పురుషుల్లో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గణంకాలు చెబుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎముకలు ధృడత్వాన్ని కోల్పోవడంతో పాటు ఎదగవని, ఆస్టియోపోరోసిస్ వ్యాధి బారిన పడిన వారికి ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవని, వ్యాధి తీవ్రత పెరిగి ఎదైనా ఎముక విరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది పేర్కొన్నారు.
వయసుతో పాటు ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతోనే ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, ముందస్తు లక్షణాలు కనిపించకపోవడంతో కేవలం 20 శాతం మంది మాత్రమే ప్రతీ ఏటా ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారని డాక్టర్ కుమార్ బాబు, డాక్టర్ శశిధర్ రెడ్డి తెలియజేశారు. మోనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయని వెల్లడించారు. వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్‌లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అలాగే మద్యపానం, దూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కుటుంబంలో ఇంతకు ముందు ఈ వ్యాధి ఎవరికైనా ఉండి ఉంటే ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని, ఈ వ్యాధిని ముందుగా గుర్తిస్తే దాన్ని నివారించడం సులువు అని వైద్యులు తెలియజేశారు.
