Clock Of Nellore ( Nellore ) – గతంలో అధికార వైసీపి నేతల బెదిరింపులు, ఒత్తిళ్లను తట్టుకోలేకే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వదిలి వైసీపిలోకి వెళ్లినట్లు నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ స్పష్టం చేశారు. వైసీపిలోకి వెళ్లినా… తమకు రాజకీయ భిక్ష పెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పల్లెత్తు మాట కూడా అనలేదని గుర్తు చేశారు. శ్రీధరన్న తమను క్షమించి, కుటుంబ పెద్దలా అక్కున చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం కార్పొరేషన్ లోని తన ఛాంబర్ లో మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ విలేకరుల సమావేశం నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనను మేయర్ ను చేసింది శ్రీధర్ రెడ్డేనని చెప్పారు. 14 నెలల క్రితం అధికార వైసీపిని శ్రీధర్ రెడ్డి వీడినప్పుడు తాము కూడా ఆయన వెంటే నడిచామని, ఆయన కోసం అవసరమైతే మేయర్ పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్దపడ్డానని మేయర్ పేర్కొన్నారు. అయితే కొద్ది రోజులకే అప్పటి అధికార పార్టీ నేతలు తమను తిరిగి వైసీపిలోకి రావాలంటే బెదిరించారని, తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకొచ్చారన్నారు. వైసీపిలోకి రాకపోతే మేయర్ పదవి నుండి తొలగిస్తామని బెదిరించారన్నారు. విధిలేని పరిస్థితుల్లో వైసీపిలోకి తిరిగి వెళ్లామన్నారు. అరాచక వైసీపిని ప్రజలు ఛీకొట్టారని, ప్రజల మనిషి అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని రూరల్ నియోజకవర్గ ప్రజలు ఆదరించారని సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబంలో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కుటుంబ పెద్ద క్షమించి అక్కున చేర్చుకుంటారో… ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా తమను క్షమించి అక్కున చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
