కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : రిటర్నింగ్ అధికారి వికాశ్ మర్మట్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని నెల్లూరు సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ తెలిపారు. ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కౌంటింగ్ నిర్వహణపై సమావేశాన్ని కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.ఓ మాట్లాడుతూ జూన్ నెల 4వ తేదీన ఉదయం 8 గంటలనుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో మొదటిగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టనున్నామని తెలిపారు. అనంతరం 8.30 గంటలనుంచి ఈవిఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది అందరూ అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ఓట్లను కార్పొరేషన్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుంచి భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో జూన్ 3 వతేదీ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రియదర్శిని కళాశాల కౌంటింగ్ కేంద్రానికి తరలించనున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ఏజంట్లను నియమించుకుని, కౌంటింగ్ ప్రక్రియపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. నియమించుకున్న ఏజంట్లకు సంభందించిన రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి ఐ.డీ కార్డులను తప్పనిసరిగా పొందాలని సూచించారు.

కౌంటింగ్ హాళ్లలో చైర్లు, టేబుళ్ల ఏర్పాటు, ఇంటర్నెట్, కేబుల్స్, లాప్ టాప్స్, ప్రింటర్లు, స్కానర్లు, సిసి కెమెరాలు వంటి సాంకేతిక పరికరాలు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, లైట్లు, తదితర మౌలిక సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ప్రాంగణంలో తాగునీటి వసతి, పారిశుధ్య నిర్వహణ, బారికేడ్ల ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్.ఓ ఆదేశించారు. కనుపర్తిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పార్కింగ్ వసతి కల్పించామని, పాఠశాల నుంచి ప్రియదర్శిని కళాశాలకు ప్రత్యేక మినీ బస్సుల సౌకర్యం కల్పించామని తెలిపారు. సిబ్బంది అందరికీ అవసరమైన స్నాక్స్, భోజన వసతి కల్పించనున్నామని తెలిపారు. కౌంటింగ్ హాళ్లలో నిబంధనల సూచికలు, కౌంటింగ్ వివరాలు ప్రదర్శించేందుకు భారీ స్క్రిన్లను ఏర్పాటు చేయనున్నామని సూచించారు. కేంద్రంలోకి మొబైల్ ఫోన్ల అనుమతి లేనందున, వాటి కోసం ప్రత్యేకంగా డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరూ సమిష్టిగా కృషి చేసి కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేద్దామని ఆర్.ఓ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు, అదనపు కమిషనర్ శర్మద, ఏ.ఆర్. ఓ.లు,వెంకటేశ్వరరావు,దేవి కుమారి , వెంకటరమణ, ఎలెక్షన్ డి.టీ.మాధవి,స్వర్ణ, చక్రపాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరుజిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు : డ్రైవర్ మృత్యువాత

Read Next

విద్యార్థులు సమాజహితం కోసం కృషిచేయాలి : VSU స్నాతకోత్సవంలో గవర్నర్

Leave a Reply

Your email address will not be published.