Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా నెల్లూరు నగరంతో పాటూ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్ధిస్తున్నారు. తాజాగా సోమవారం 1వ డివిజన్ లో నిర్వహించిన ప్రచారానికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 1వ డివిజన్ లోని నవలాకులతోట, హరిజన వాడ, దొరతోపు కాలనీలో ప్రచారం నిర్వహించారు. స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కోటంరెడ్డి ప్రసంగించారు. వైసీపి నేతలు చెప్పే మోసపూరితమైన మాటలు విని ఆ పార్టీకి ఓటు వేయవద్దని సూచించారు. ఒక్క సారి వైసీపికి ఓటు వేసిన పాపానికి ఐదేళ్ల నుండి ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారని, ప్రజలు ఈ ఎన్నికల్లో ఆ తప్పు చేయవద్దని హెచ్చరించారు. అనుభవజ్ఞులైన చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ ను 4వేలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. 24 గంటలూ ప్రజల కోసం, ప్రజలతోనే ఉన్న తనను ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, అలాగే ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
