Clock Of Nellore ( Nellore ) – ఉద్యమాల పురిటి గడ్డ… సింహపురి గర్జనతోనే జగన్ పతనం మొదలయ్యిందని, జగన్ అరాచకాలపై మొట్ట మొదట గళమెత్తింది నెల్లూరుజిల్లానేనని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినత పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన శుక్రవారం రాత్రి నెల్లూరుకు విచ్చేశారు. దర్గామిట్ట కేవిఆర్ పెట్రోల్ బంకు సెంటర్ నుండి నర్తకి సెంటర్ వరకూ ఇరువురు నేతలు రోడ్ షో నిర్వహించారు. నెల్లూరు ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. ర్యాలీ అనంతరం నర్తకి సెంటర్ ప్రజాగళం సభను నిర్వహించారు. జగన్ అరాచకాలపై మొట్ట మొదట తిరగబడింది నెల్లూరుజిల్లానేనని గుర్తు చేశారు. నెల్లూరు స్పూర్తిని రాష్ట్రం మొత్తం తీసుకుందని పేర్కొన్నారు. నెల్లూరు, చెన్నైను అనుసంధానం చేస్తూ సీటీని అభివృద్ది చేస్తానన్నారు. నెల్లూరును అద్భుతమైన సీటీగా తీర్చిదిద్దుతామని, అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 5వేల కోట్లతో నెల్లూరులో భూగర్భ డ్రైనేజీ పనులు చేపడితే వైసీపి ప్రభుత్వం దాన్ని చిధ్రం చేసిందన్నారు. బారా షహీద్ దర్గాను తానే అభివృద్ది చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. నారాయణ నెల్లూరులో ఏసి బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తే వైసీపి అరాచక శక్తులు వాటిని మూసివేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నెల్లూరు జిల్లాలో నిలిచిపోయిన అభివృద్ధి పనులన్నీ తిరిగి చేపడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
