Clock Of Nellore ( Nellore ) – వైసీపి నేత, ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మాజీ ఛైర్మైన్ సూరిశెట్టి నరేంద్ర తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. సోదరులతో కలిసి టిడిపిలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే టిడిపి అగ్ర నేతలు ఆయన్ను కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. టిడిపి అధికారంలోకి వస్తే జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్లు తెలిసింది. స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితుడైన సూరిశెట్టి నరేంద్రకు వ్యాపార వర్గాలు, మరియు యువతతో మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో ఆ విషయాన్ని గ్రహించిన ఆనం వివేకానందరెడ్డి నరేంద్రను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని తన వెంటే అడుగులు ముందుకు వేయించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన నేపద్యంలో జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో నరేంద్ర సతీమణి ఉషారాణి కాంగ్రెస్ పార్టీ నుండి కార్పొరేటర్ గా పోటీ చేయగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన వారిలో అత్యధిక ఓట్లు సాధించిన వారిలో ఉషారాణి రాష్ట్ర స్థాయిలో ఏకైక మహిళ కావడం విశేషం. నరేంద్ర ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఛైర్మైన్ గా కూడా సేవలందించారు. ఆనం వివేకానందరెడ్డి మరణానంతరం మౌనంగా ఉండిపోయిన సూరిశెట్టి నరేంద్ర, వారి సోదరులను 2019లో మాజీ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ వైసీపిలోకి ఆహ్వానించారు. వైసీపి అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సూరిశెట్టి బ్రదర్స్ భారీ స్థాయి జనసమీకణతో నెల్లూరు నర్తకి సెంటర్ లో వైసీపిలో చేరారు. వివిధ కారణాలతో సూరిశెట్టి నరేంద్రకు ఎలాంటి పదవి దక్కలేదు. అయినప్పటికీ అనీల్ కుమార్ యాదవ్ వెంటే ఉన్నారు. అనీల్ కుమార్ యాదవ్ నరసారావు పేట ఎంపి అభ్యర్ధిగా వెళ్లడంతో నరేంద్ర మళ్లీ మౌనంగా ఉండిపోయారు. ఈ విషయాన్ని గ్రహించిన జిల్లా టిడిపిలోకి ఓ అగ్రనేత స్వయంగా నరేంద్ర నివాసానికి వెళ్లి టిడిపిలోకి రావాలని ఆహ్వానించారు. గత అనుభవాలను దృష్ఠిలో ఉంచుకుని నరేంద్ర వారికి ఎలాంటి మాటా ఇవ్వలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపి నేతలు పార్టీలోనే ఉండాలని, పార్టీ వీడవద్దని నరేంద్రను కోరుతున్నారు. అయితే నరేంద్ర వారి సూచనలకు స్పందించకపోవడంతో… ఆ విషయాన్ని విజయసాయి రెడ్డి దృష్ఠికి తీసుకెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో విజయసాయిరెడ్డి… సూరిశెట్టి నరేంద్రతో చర్చించనున్నారు. వైసీపి మళ్లీ అధికారంలోకి వస్తే జిల్లా స్థాయిలో ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇస్తామని హామీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.
