
Clock Of Nellore ( Nellore & Tirupathi ) – నెల్లూరుజిల్లాకు కలెక్టర్ గా పనిచేసి జిల్లా ప్రజల ప్రసంశలు అందుకున్న కె. రాజు నెల్లూరు పార్లమెంటు బరిలో దిగనున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీకి సలహాదారునిగా ఉన్న కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు నుండి తన అదృష్ఠాన్ని పరీక్షించుకోనున్నారు. నెల్లూరు ఎంపిగా కాంగ్రెస్ పార్టీ తరపున కె. రాజు పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన పేరును ఏఐసిసి ప్రకటించింది. అలాగే తిరుపతి పార్లమెంటుకు మాజీ ఎంపి చింతా మోహన్ పోటీ చేయనున్నారు. కొప్పుల రాజు ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విభాగం జాతీయ సమన్వయకర్తగా, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం. 1981 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన 1988 నుంచి 1992 వరకు నెల్లూరు కలెక్టరుగా పనిచేశారు. ఆయన కలెక్టరుగా ఉన్నప్పుడే జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం, సాక్షరతా ఉద్యమం జరిగాయి. 2013లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. యూపీయే ప్రభుత్వంలో సోనియాగాంధీ అధ్యక్షతన పనిచేసిన నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ సెక్రెటరీగా పనిచేశారు. ఆర్టీఈ, ఆర్టీఐ, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రత – చట్టాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. నెల్లూరు జనరల్ స్థానం నుంచి దళిత వర్గానికి చెందిన ఈయన్ను నిలబెట్టడం విశేషం. తిరుపతి ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి 1984లో టిడిపి తరఫున, 1989, 1901, 1998, 2004, 2009లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ 2014, 2019లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి తిరుపతి నుండే రంగంలోకి దిగుతున్నారు.