వైసీపిలోకి మలిరెడ్డి కోటారెడ్డి : సిఎం జగన్ సమక్షంలో చేరిక

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డి సోదరులు మలిరెడ్డి కోటారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ రంజీ క్రికెటర్ అయిన కోటారెడ్డి ప్రస్తుతం ఇండియన్ రెడ్ క్రాస్ లో మేనేజింగ్ కమిటి సభ్యునిగా, పలు క్రీడా సంఘాలకు అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత పదేళ్ల నుండి వైసీపి బలోపేతానికి కృషి చేసిన మలిరెడ్డి కోటారెడ్డి నిన్నటి వరకూ పార్టీలో చేరలేదు. తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపద్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోదరులు మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి మంగళవారం తాడేపల్లికి వెళ్లిన మలిరెడ్డి కోటారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపి తీర్ధం పుచ్చుకున్నారు. సిఎం జగన్ ఆయనకు స్వయంగా పార్టీ కండువా వేసి వైసీపిలోకి ఆహ్వానించారు. నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో వైసీపి అభ్యర్ధుల విజయానికి కృషి చేయాలని సిఎం సూచించారు. కమ్యూనిస్టు పార్టీలోని రాడికల్స్ విభాగంలో చురుగ్గా పనిచేసి ఆ తర్వాత న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న స్వర్గీయ మలిరెడ్డి కృష్ణ ప్రసాద్ కుమారులే మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డి. వీరు కూడా తండ్రి బాటలోనే కమ్యూనిస్టు భావజాలంతో ఉండే వారు. మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరించేవారు. తర్వాత తండ్రి సూచనల మేరకు ఇద్దరూ న్యాయవాదులుగా స్థిరపడ్డారు. తండ్రికి తగ్గ తనయులుగా నెల్లూరుజిల్లాలో పేరెన్నిక గన్న న్యాయవాదులుగా గుర్తింపు పొందారు. వీరికి అన్నీ రాజకీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఉన్న అనుబంధం కారణంగా 2014, 2019 ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి విజయం కోసం నెల్లూరు రూరల్ లో పనిచేసి సఫలీకృతమయ్యారు. నెల్లూరు పార్లమెంటు వైసిపి అభ్యర్ధి విజయసాయి రెడ్డితోనూ వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి. గత ఏడాది కాలంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మలిరెడ్డి సోదరులకు వైసీపిలో చేరాలని ఇటీవల పలువురి నుండి ఆహ్వానాలు అందాయి. వారం క్రితమే నెల్లూరులో విజయసాయి రెడ్డిని కూడా కలిశారు. తాజాగా మంగళవారం మలిరెడ్డి కోటారెడ్డి సిఎం జగన్ సమక్షంలో వైసీపి కండువా కప్పుకున్నారు. ఆయన సోదరులు మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాత్రం పార్టీలో చేరలేదు. పార్టీలో చేరకపోయినా అనధికారికంగా ఆయన కూడా పార్టీలో ఉన్నట్లే భావించాలి. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో మలిరెడ్డి సోదరులకు వ్యక్తిగత కేడర్ కొంత మేర ఉంది.

Read Previous

నెల్లూరులో తండ్రీ, తనయ ఎన్నికల ప్రచారం : టిడిపికి ఓటు వేయాలని విన్నపం

Read Next

మెడికవర్ లో అత్యంత క్లిష్టమైన గుండె ఆపరేషన్ విజయవంతం

Leave a Reply

Your email address will not be published.